BJP : ఎంపీ ఎన్నిక ఏకగ్రీవం.. బీజేపీ ఖాతాలో తొలి సీటు
సూరత్ లోక్‌సభ ఎన్నిక ఏకగ్రీవమయింది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు
సూరత్ లోక్‌సభ ఎన్నిక ఏకగ్రీవమయింది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్ ను కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ చెల్లకపోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమయింది. 1952 తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకూ సూరత్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్ధి ఎన్నిక ఏకగ్రీవం కాలేదని చెబుతున్నారు.
నామినేషన్ తిరస్కరణతో...
వచ్చే నెల 7వ తేదీన పోలింగ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభని దాఖలు చేసిన నామినేషన్ పై ప్రతిపాదించిన సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటంతో తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి చెబుతున్నారు. అంతేకాదు నామినేషన్ సమయంలో ప్రతిపాదించిన వారు కూడా హాజరు కాలేదని తెలిపారు. దీంతోపాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, బీఎస్పీతో పాటు మరో ముగ్గురు స్థానిక పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవమయినట్లు అధికారి వెల్లడించారు.