మరికొన్ని గంటల్లో అరుదైన ఘట్టం.. మకరజ్యోతి రహస్యం ఏంటి?

Makara Jyothi Darshan: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు

Update: 2024-01-15 11:01 GMT

Sabarimala Ayyappa Swamy

Makara Jyothi Darshan: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం. అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం. అదే మకరజ్యోతి దర్శనం. మరికొద్ది నిమిషాల్లో శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేయనుంది. ఇప్పటికే చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల నినాదాలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. శబరిమలలో మరికొన్ని గంటల్లో మకరజ్యోతి కనిపించబోతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ మహోజ్వల వెలుగు ఉన్న రహస్యమేంటి? చరిత్ర ఏం చెప్తోంది? అని చూస్తే..

స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిస్తారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరగనుంది. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని గస్తీ కాస్తున్నారు.

మండలకాలంపాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు అయ్యప్ప భక్తులు. పంబలో స్నానం చేసి.. రాళ్లదారుల్లో, అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములు.. శబరిగిరీశుని జ్యోతి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నారు.

మకర జ్యోతి జనవరి 15న మకర సంక్రాంతి నాడు వచ్చే నక్షత్రం. ప్రతి ఏటా మకర సంక్రాంతి నాడు.. శబరిమల ఆలయానికి భారీగా పోటెత్తే పర్వదినం ఈ మకరవిళక్కు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు.

సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి.. వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. తర్వాత పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి.. ఇరుముడి సమర్పించి.. ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు అయ్యప్ప స్వాములు. స్వామియే శరణమయ్యప్ప.. జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప.. ఇదీ భక్త జనులు మకర జ్యోతి రోజున శబరిమలపై చేసే శరణుఘోష. ఇంతకీ శబరిమలలో మకరవిళక్కు ఎందుకు చేసుకుంటారు? దీని వెనకున్న పురాణ గాథ ఏంటి? అని చూస్తే..

రామలక్ష్మణులు.. శబరిమలలో భక్త శబరిని కలుస్తారట. ఆమె పెట్టే పండ్లను రుచి చూస్తారట. అక్కడ తపస్సు చేస్తున్న ఓ దివ్య శక్తిని చూస్తాడట శ్రీరాముడు. అతడెవరని శబరిని అడుగుతాడట. అతడు శాస్తాగా చెబుతుంది భక్త శబరి. అంతలో రాముడు శాస్తా వైపు నడుస్తాడట. శాస్తా రామునికి స్వాగతం పలికేందుకు లేచి నిలబడతాడట. ఈ అపురూప సన్నివేశానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని మకర విళక్కు రోజున జరుపుకుంటారట. మకర విళక్కు రోజున ధర్మశాస్తా.. భక్తులను ఆశీర్వదించడానికి తన తపస్పుకు విరామం ఇస్తాడని..నమ్ముతారు స్వామిభక్తులు.

స్వామి దీక్ష విరమించి ఎంతో విశ్రాంతిగా ఉన్న సమయంలో తమ మొర ఆలకిస్తాడనీ.. తమను కాపాడమంటూ భక్తులు చేసే ఆ శరణుఘోష విని.. పేరు పేరునా.. వారి కోర్కెలు నెరవేర్చుతాడనీ విశ్వసిస్తారు భక్త జనులు. అయ్యప్ప అనగానే చూసి తీరాల్సిన మహా మహోత్సవం మకరజ్యోతి దర్శనమే. ఈ దర్శనం శబరిమలపై చేసుకోలేని వారు.. ఇక్కడే తమ ఇళ్లలో పద్దెనిమిది మెట్లకు గుర్తుగా పద్దెనిమిది దీపాలను వెలిగించి.. జ్యోతి దర్శనం చేసుకుంటారు స్వామి భక్తులు.

Tags:    

Similar News