Raksha Bhandan : ఈరోజు సోదరుడికి రాఖీ ఏ సమయంలో కట్టాలి? పండితుల సూచనలివే

నేడు దేశమంతా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్లు ప్రేమ సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు

Update: 2024-08-19 02:13 GMT

శ్రావణ పౌర్ణమి... రాఖీ పౌర్ణమి అంటేనే దేశమంతా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ కట్టడం ఈ పండగ స్పెషల్. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది ఒక అన్నను, ఒక తమ్ముడిని తనకు జీవితాంతం రక్షణగా ఉండాలని, తనకు ఏ ఆపద వచ్చినా కాపాడాలంటూ చెల్లి, అక్క కట్టే పండగ. అందుకే భారతీయ సంప్రదాయంలో ఇది ఒక మహత్తరమైన పండగ. ఈరోజు దేశమంతటా రాఖీ పండగను జరుపుకుంటున్నారు.

చిన్నా, పెద్ద తేడా లేకుండా...
ఈ పండగ వేళ తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. వయసుతో సంబంధం లేదు. పెళ్లయిన వారి నుంచి పెళ్లి కావాల్సిన వారి దగ్గర నుంచి చిన్నారుల వరకూ రక్షాబంధన్ పండగను జరుపుకుంటారు. తనకు తోడుగా, నీడగా అన్న ఉంటాడన్న నమ్మకం, భరోసా ఆ చిట్టి చెల్లెలకు ధైర్యాన్ని నింపుతుంది. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు అండగా నిలుస్తాడని ఆమె నమ్మకం. అందుకే ఈ పండగను అన్ని రాష్ట్రాల్లో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
ఉత్తర భారత దేశానికే...
ఒకప్పుడు ఉత్తర భారత దేశానికి పరిమితమైన రక్షాబంధన్ పండగ ఇప్పుడు దేశమంతా విస్తరించింది. అక్కాచెల్లెళ్ల బంధం విడదీయలేనిది. ఏదైశమైనా.. ఎక్కడైనా రక్తసంబంధం వారిని బాధల్లోనూ, ఆనందాల్లోనూ కలిసేలా చేస్తుంది. తన సోదరికి రాఖీ కట్టి స్వీటు తినిపిస్తే ఆ అన్న తనకు చేతనయింత సాయాన్ని అందిస్తాడు. డబ్బులు కానీ, బంగారం కానీ ఇచ్చి చెల్లెలు ముఖంలో ఆనందం కనపడాలని సోదరుడు భావిస్తాడు. చెల్లెలకు రక్షణగా తాను ఉంటానని నేడు సోదరుడు హామీ ఇస్తాడు. సోదరుడి నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
భద్రకాలంలో...
మన పురాణాల్లోనూ రాఖీ పండగకు విశిష్టమైన స్థానం ఉంది. అయితే నేడు రాఖీ పండగని దేశమంతా జరుపుకుంటున్నారు. పంచాంగం ప్రకారం భద్ర కాలం ఉదయం 5 గంటల 53 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 01:32 వరకు ఉందని పండితులు చెబుతున్నారు. భద్ర కాలం ముగిసిన తరువాత సోదరీమణులు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.రాఖీ కట్టే శుభ సమయం రేపు మధ్యాహ్నం 01:46 నిమిషాల నుండి రాత్రి 10 గంటలలోపు, ఆ సమయంలో ఎప్పుడైనా రకాఖీ కట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News