మోదీ మౌనంగా ఎదుర్కొన్నారు: అమిత్ షా
గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని
గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 19 ఏళ్లుగా తప్పుడు ఆరోపణల్ని మోదీ మౌనంగా ఎదుర్కొన్నారన్నారు. మోదీపై విమర్శలు వస్తున్నా.. ఎవరూ కూడా ధర్నా చేయలేదని రాహుల్ గాంధీపై కౌంటర్లు వేశారు. గుజరాత్ అల్లర్లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా 19 ఏళ్లు మోదీ పోరాటం చేశారని, శివుడు తన గొంతులో విషాన్ని దాచినట్లు మోదీ కూడా ఆ బాధను దిగమింగినట్లు చెప్పారు. మోదీ బాధను చాలా దగ్గర నుంచి చూచినట్లు తెలిపారు. చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ అంశం గురించి ఏమీ మాట్లాడరని, ఎందుకంటే ఆ కేసు కోర్టు పరిధిలో ఉందని షా తెలిపారు. సిట్ విచారణకు హాజరయ్యే సమయంలో మోదీ ధర్నా చేయలేదని, తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నా చేయించలేదన్నారు. సీఎంను సిట్ విచారించాలని భావిస్తే, ఆయన దానికి సహకరించినట్లు తెలిపారు. నిరసనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
అప్పటి అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం.. 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాజా దర్యాప్తునకు ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా, మోదీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని తెలిపింది.