తాగునీటి వెతలు.. భరించలేక గ్రామం వదిలి వెళ్లిపోతున్న వధువులు

నాసిక్ కు 90 కిలోమీటర్ల దూరంలో సుర్గానా తాలూకాలోని దండిచిబారి అనే గ్రామం ఉంది. ఆ గ్రామ జనాభా 300 మంది. నీటికొరత కారణంగా..

Update: 2022-05-04 07:55 GMT

నాసిక్ : వేసవికాలం వస్తుందంటేనే.. తాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. నదిపరివాహక ప్రాంతాలకు కాస్త తాగునీటి కష్టాలు తగ్గినప్పటికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంకా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి కరువు తాండవిస్తోంది. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఉంది. తాగునీటి కోసం గ్రామంలోని మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి.. మూడు గంటలపాటు శ్రమించాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

నాసిక్ కు 90 కిలోమీటర్ల దూరంలో సుర్గానా తాలూకాలోని దండిచిబారి అనే గ్రామం ఉంది. ఆ గ్రామ జనాభా 300 మంది. నీటికొరత కారణంగా గ్రామంలోని అబ్బాయికి పిల్లనిచ్చేందుకు ఎవరూముందుకు రావడానికి సాహసించలేరు. దీనిని బట్టి ఆ గ్రామంలో నీటికరువు ఎంతమేర ఉందో అర్థం చేసుకోవాలి. గతంలో గ్రామానికి కొత్తగా పెళ్లిచేసుకుని వచ్చిన వధువులు.. నీటి కొరతకు భయపడి తిరిగి పుట్టింటికి పారిపోయిన ఘటనలు లేకపోలేదు. గ్రామస్థుడు గోవింద్ వాగ్మారే కేవలం రెండు రోజుల పాటు జరిగిన ఒక వివాహ కథను వివరించాడు.
"2014లో ఒక వధువు పెళ్లయిన రెండో రోజే వెళ్లిపోయిందన్న కథ చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె నీరు తీసుకురావడానికి ఇతర మహిళలతో కలిసి కొండ దిగువకు వెళ్లింది. అక్కడికి వెళ్లాకే ఆమెకు నీరు తీసుకుని రావటం ఎంతకష్టమో అర్థమయింది. అంతే.. ఆమె కల్షిని (నీటి కుండ) అక్కడే వదిలి తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది" అని అతను చెప్పాడు. గ్రామంలో ఉన్నవారు ప్రతిఏటా మార్చి నుంచి జూన్ వరకూ తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు.
నీటికోసం గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న కొండదిగువకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న ఒక బండవద్ద కుహరంలోకి కొద్దిపాటి నీరు వస్తుంది. ఆ కుహరం నిండిన తర్వాత గిన్నెతో ఆ నీటిని తీసి కుండలో పోసుకుంటారు. అలా ఒక కుండ నిండటానికి మూడు గంటల సమయం పడుతుందని గ్రామానికి చెందిన మహిళ తెలిపింది. గ్రామంలోని మహిళలు రోజుకు రెండుసార్లు నీటికోసం కొండ కిందికి వెళ్తుంటారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత నీటికోసం వెళ్తారు. ఉదయం 4 గంటలకే నీటికోసం ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారితే.. సూర్యుడి వేడికి ఆ మాత్రం నీరైనా దొరకదు.
గ్రామ పరిస్థితిపై సర్పంచ్ జైరామ్ వాగ్మారే మాట్లాడుతూ.. నీటికోసం గ్రామస్తుల పోరాటం తనకు అర్థమవుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి నీరు అందించేందుకు అప్పుడప్పుడు ట్యాంకర్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నానన్నారు. "ఇక్కడికి చాలామంది జర్నలిస్టులు వచ్చి మాగురించి, మా గ్రామం గురించి అడిగి ఫొటోలు తీసుకుని వెళ్తారు. కానీ.. ఇప్పటివరకూ మాకెవరూ సహాయం చేయలేదు. తరతరాలుగా మా గ్రామం కరువుతో అల్లాడుతోంది. గ్రామానికి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోవడానికి వధువులు ఆలోచిస్తున్నారు. 2008-09 సంవత్సరంలో నీటి కరువును భరించలేక ముగ్గురు వివాహిత మహిళలు గ్రామం వదిలి వెళ్లిపోయారు. దండిచిబారి గ్రామం గురించి తెలిసిన వారెవరూ తమ కూతుర్నిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకోరు" అని సర్పంచ్ వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేస్తే.. తర్వాతి తరంవారైనా సుఖంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News