బాబును అవి గట్టెక్కిస్తాయా !!

Update: 2018-12-21 14:30 GMT

ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ మొదలెట్టేసి చాలా కాలమే అవుతోంది. ఎపుడైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుందో ఆనాటి నుంచి ధర్మ పోరాట దీక్షల పేరుతో సభలు నిర్వహించి పసుపు పార్టీ ప్రత్యర్ధులపై విమర్శల బాణాలను ఎక్కుపెడుతూనే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే విశాఖ, విజయనగరం సభలు నిర్వహించిన టీడీపీ శ్రికాకుళంలోనూ 22న ధర్మ పోరాట సభ పెడుతోంది. పైసా ఖర్చు లేకుండా ఈ విధంగా సర్కార్ సొమ్ముతో పార్టీ ప్రచారం బాగానే చేసుకుంటున్న టీడీపీ జనంలో ఏ మేరకు పొలిటికల్ మైలేజ్ సాధిందన్నది మాత్రం సందేహమేనంటున్నారు.

అంతటా జనాల తరలింపే...

ముఖ్యమంత్రి సభలు అంటే షరా మామూలుగానే జనాల తరలింపు పెద్ద ఎత్తున చేయడం సాధారణమైపోయింది. అంగన్ వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళల ఆసరాతో జనాలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకురావడం ద్వారా బ్రహ్మాండంగా సభ జరిపించేశాం అని టీడీపీ తమ్ముళ్ళు ముచ్చట పడుతున్నారు. మరో వైపు సీఎం సభల పేరిట బస్సుల తరలింపుతో జనంలో పెరుగుతున్న వ్యతిరేకత మరో స్థాయిలో ఉంటోంది. ఇక ట్రాఫిక్ మళ్ళింపుల కష్టాలు అదనపు తలనొప్పులు. దాంతో సామాన్యులు మధ్యతగతి వర్గాలు అధికారిక పర్యటనల పేరిట చేస్తున్న హంగామాకు పూర్తిగా విముఖంగా ఉంటున్నారు. దానికి తోడు సభకు వచ్చిన వారంతా తెలుగుదేశం పార్టీ చెప్పింది వినేసి ఓటేస్తారన్న నమ్మకమూ లేదు. ఎటు తిరిగి సభ పెట్టాం, ఏదో చెప్పాం అన్నట్లుగానే ధర్మ పోరాట దీక్షలు ఉంటున్నాయని అంటున్నారు.

ఆ జిల్లాల్లో బలమేదీ...?

నిజానికి ధర్మ పోరాట దీక్షలు విజయవంతం అయ్యాయని చెప్పుకుంటున్న విశాఖ, విజయనగరంలో పార్టీ బలపడిన దాఖాలాలు ఎక్కడా లేకపోగా నానాటికీ తీసికట్టుగా పరిస్థితి మారుతోంది. ఎక్కడికక్కడ నాయకులు గ్రూపులు కట్టి అసలుకే ఎసరు తెస్తున్నారు. జనంలో పేరున్న, నోరున్న నాయ‌కుడు లేక ఆయా జిల్లాలో పార్టీ పడకేస్తోంది. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే నాయకత్వం లేదని జనమే అంటున్నారు విజయనగరంలో ఏకంగా నిన్నటి వరకూ కేంద్ర మంత్రిగా అశోక్ తో పాటు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నాలుగున్నరేళ్ళలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని అంటున్నారు.

కనీస సమస్య కూడా.....

మునిసిపల్ కౌన్సిలర్ నుంచి వార్దు మెంబర్ వరకూ అంతా అధికార పార్టీ నేతలే ఉన్నా కూడా కనీస సమస్యలు కూడా పరిష్కారం కాలేదన్న వెలితి నిండుగా ఉంది. అటువంటి సమయంలో ధర్మ పోరాట దీక్షలు ఎంతవరకూ పార్టీని రక్షిస్తాయన్నది అధినాయకత్వమే ప్రశ్నించుకోవాలని అంటున్నారు. వాపును చూసి బలం అనుకుంటే వచ్చే ఎన్నికల్లో అసలు నిజాలు తెలిసి బేజారెత్తాల్సి ఉంటుందని పార్టీలోని నిబద్ధత కలిగిన నాయకులు సూచిస్తున్నారు.

Similar News