రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటికీ తన వెంట సినీ గ్లామర్ ను తెచ్చుకోలేకపోయింది. ఇక ఏపీలోనూ ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. మరో ఐదారు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆయువుపట్టు తొలి నుంచి సినీ గ్లామర్ అని వేరేచెప్పాల్సిన పనిలేదు. ఎన్టీరామారావు చిత్రపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడంతో ఆయన వెంట సింహభాగం పరిశ్రమ నడిచింది. వెన్నుదన్నుగా నిలిచింది. అనేక మంది స్టార్లు ఎన్టీఆర్ కు జైకొట్టారు. కొందరు ఏకంగా పార్టీలో చేరితే మరికొందరు తమ మద్దతును ప్రకటించారు.
ఎన్టీఆర్ తర్వాత కూడా....
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత అదే చిత్ర పరిశ్రమ చంద్రబాబుకు అండగా నిలిచింది. చంద్రబాబు విజన్ తమకు నచ్చిందని స్క్రీన్ ల ముందుకు వచ్చి చెప్పేవారు. గతంలో టీడీపీలో యాక్టివ్ గా కన్పించేవారు సయితం ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదు. వచ్చేఎన్నికల ప్రచారంలో సినీనటుల హంగామా ఖచ్చితంగా ఉంటుందన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ రాజకీయ రణరంగంలోకి దూకుతున్నారు. ఆయన సినీహీరోగా ఒక వెలుగు వెలగడంతో ఆయకు గ్లామర్ ప్లస్ పాయింట్ కానుంది.
రాష్ట్రం విడిపోవడం వల్లనేనా?
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్ వంటి వారు తప్ప ఎవరూకన్పించడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీకి మద్దతిచ్చే వారి సంఖ్య టాలీవుడ్ లో తగ్గిపోయిందనే విశ్లేషణలు విన్పిస్తున్నాయి. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉండటం,ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండటంతో చంద్రబాబుకు నేరుగా మద్దతిచ్చే ధైర్యాన్ని ఎవరూ చేయలేకపోతున్నారు. మనసులో మద్దతివ్వాలని ఉన్న కొందరుకూడా తమ వ్యాపారాల కోసం మౌనంగా ఉంటున్నారన్న టాక్ చిత్రపరిశ్రమలో బలంగా విన్పిస్తోంది.
మరి..ఏం చేయాలి...?
టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతిచ్చే వారు టాలీవుడ్ లో ఎక్కువ కావడం విశేషం. కమెడియన్ల దగ్గర నుంచి హీరోల వరకూ జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సంఘీబావం ప్రకటించివచ్చారు. టాలీవుడ్ లో ఉన్న బలమైన సామాజిక వర్గం కూడా ఇప్పుడు నేరుగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చే అవకాశం లేదనిపిస్తోంది. కొందరిని టీడీపీ నేతలు కాంటాక్టు చేసినా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. అసలే అధికారంలో ఉండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబుకు అదనపు బలంగా భావిస్తున్న సినీ ఇండ్రస్ట్రీ కూడా మొహం చాటేయడం నష్టమేనన్నది పరిశీలకుల భావన.మరి ఎన్నికల నాటికి ఎవరైనా గ్లామర్ అద్దుతారేమో చూడాలి మరి.