గంటా బాగానే మంట పెడుతున్నాడే ?

గంటా శ్రీనివాసరావు రాజకీయంగా కొరకరని కొయ్యగా మారిపోయాడని వైసీపీ భావిస్తోంది. ఆయన్ని పార్టీలో చేర్చుకోవాలని అనుకున్నా తాను సీనియర్ మోస్ట్ లీడర్ ని ముప్పయ్యేళ్ళకే ఎంపీని అయ్యానని, [more]

Update: 2021-04-08 12:30 GMT

గంటా శ్రీనివాసరావు రాజకీయంగా కొరకరని కొయ్యగా మారిపోయాడని వైసీపీ భావిస్తోంది. ఆయన్ని పార్టీలో చేర్చుకోవాలని అనుకున్నా తాను సీనియర్ మోస్ట్ లీడర్ ని ముప్పయ్యేళ్ళకే ఎంపీని అయ్యానని, తన ట్రాక్ రికార్డ్ చాలా గొప్పదని గట్టిగానే కౌంటరేశారు గంటా శ్రీనివాసరావు. అంటే తనకంటే వైసీపీ పెద్దలు జూనియర్లు అన్నట్లుగా ఆయన ఇండైరెక్ట్ గానే వారి ఇగోను హర్ట్ చేశారు. సరే అలాగని గంటా శ్రీనివాసరావు ఊరుకుంటున్నారా అంటే వైసీపీని బాగానే కార్నర్ చేస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం అంటే గంటా శ్రీనివాసరావు వైసీపీని టార్గెట్ చేశారు.

రాజీనామాతో …..

మొత్తానికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారన్న దానికి నిరసంగా తన రాజీనామా అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. చూస్తే కేంద్రంలోని బీజేపీ బాగానే ఉంది. కానీ చిక్కుల్లో వైసీపీ పడుతోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇపుడు ఆమోదిస్తే తంటా లేకపోతే మరో తంటా అన్నట్లుగా అధికార పార్టీ పరిస్థితి తయారైంది. గంటా శ్రీనివాసరావుమాత్రం తన రాజీనామా ఆమోదించి తీరాలని గట్టిగానే పట్టుదల పడుతున్నారు. ఆయన ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇంటికి వెళ్ళి మరీ రాజీనామాను ఆమోదించడని విన్నపం చేశారు.

కెలికిన విజయసాయి….

గంటా శ్రీనివాసరావు నిజానికి రాజీనామా చేసి తన మానాన తాను ఉంటే అది ఉత్తిత్తి రాజీనామా అంటూ ఆయన్ని కెలికింది విజయసాయిరెడ్డే అని వైసీపీలో ఇపుడు వినిపిస్తున్న మాట. గంటాకు చిత్తశుద్ధి లేదని, ఆయన డ్రామాలు ఆడుతున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ తో గంటా శ్రీనివాసరావు తన దూకుడు ఒక్కసారిగా పెంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన రాజీనామా ఆమోదించాల్సిందే అంటూ తమ్మినేనిని ఆయన కోరుతున్నారు. అంతే కాదు ఉక్కు కర్మాగారం విషయంలో రాజీనామా చేసిన తొలి ప్రజాప్రతినిధిగా రికార్డులకెక్కాలని కూడా చూస్తున్నారు.

గురి ఇటు వైపే…

ఇక గంటా శ్రీనివాసరావు తన రాజీనామాతోనే ఊరుకోవడంలేదు. తాను రాజీనామా చేసినట్లుగానే వైసీపీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి దీని వల్ల పోయేదేమీ లేదు. పైగా గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ ఆ పార్టీ మనిషే. వైసీపీకే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఉన్నారు. దాంతో పాటు గంటా శ్రీనివాసరావు ఏకంగా సీఎం జగన్ ని కూడా రాజీనామా చేయమంటున్నారు. ఇలా గంటా పన్నిన ఉచ్చులోకి చిక్కి ఇపుడు వైసీపీ విలవిలలాడుతోంది. గంటా రాజీనామాను ఇప్పటికైతే ఆమోదించకుండా ఆపుతున్నారు. రేపో మాపో కనుక స్పీకర్ ఆమోదిస్తే మాత్రం వైసీపీ అడ్డంగా దొరికిపోవడం ఖాయమన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.

Tags:    

Similar News