గెలిచేందుకు సవాలక్ష మార్గాలు ఉన్న ఈ రోజుల్లో పార్టీతో సంబంధం లేకుండా డబ్బున్న నేతలు, పలుకుబడిని పెంచుకోవడానికి సొంతంగా పధకాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఎలాగైనాగెలవడమే ముఖ్యం అన్న ఆలోచనతోనే వారు ముందుకు సాగుతున్నారు. విషయానికి వస్తే భీమిలి ఎమ్మెల్యే, విశాఖ అర్బన్ జిల్లా మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికలు పెను సవాల్ గా మారాయి. పార్టీలోని ప్రత్యర్ధులతో పాటు బయట వారిని కూడా ఏకకాలంలో ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది. దాంతో గంటా ఇప్పుడు తనదైన రాజకీయాలు చేస్తున్నారు.
అన్న క్యాంటీన్ కాదది....
రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల క్రితం ప్రవేశపెట్టారు. అక్కడ ఐదు రూపాయలకే రెండు పూటలా టిఫిన్, భోజనం వంటివి ఇస్తున్నారు. మొత్తం పదమూడు జిల్లాల్లో వీటిని విస్తరించారు కూడా. దాని వల్ల ప్రతీ చోటా పార్టీకి ఓటు బ్యాంక్ ప్రత్యేకంగా ఏర్పడి విజయానికి బాటలు వేస్తుందని బాబు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన తమ్ముడు, మంత్రి వర్గ సహచరుడు గంటా దీన్ని తనదైన స్టయిల్లో వాడుకుంటూ కొత్త పధకంగా మార్చుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీలో అన్న క్యాంటీన్లను ఉచిత భోజన శాలలుగా గంటా మార్చేశారు. ఇక్కడ ఎంత మందైనా భోజనం చేయవచ్చు. ఎవరూ ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఆ మొత్తాన్ని గంటా సొంతంగా కట్టుకుంటారు. అంటే మంత్రి గంటా ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారన్న మాట. బాబు అయిదు రూపాయలకే ఆహరం అంటే, గంటా ఫ్రీ అంటూ మొత్తంగా ఓటర్ల మనసు కొల్లగొట్టేస్తున్నారు. ఇపుడు గంటా స్కీం చూసి మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు ఖంగు తింటున్నారట.
దగ్గరుండి వత్తిడి...
ఇంతటితో ఊరుకోని గంటా తన అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు అధికారులపై వత్తిడి తెస్తున్నారు. గతంలో తాను ఇచ్చిన హామీలు అమలు కాకుండానే ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో గంటా వాటిలో కొన్ని అయినా పూర్తి చేయాలని డిమాండ్ పెడుతున్నారు. అవి పూర్తి కావడం కోసం అవసరమైన సహాయ సహకారాలు తాను స్వయంగా చూసుకుంటానని కొత్త పధకాలు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ గంటా తనదైన శైలిలో పధకాలతో పాటు హామీలు నెరవేరుస్తూ జనంలోకి వస్తున్నారు.