సార్ కి దారి తెలియడం లేదా..?

Update: 2018-12-20 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి పార్టీలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంతో ఏర్పాటైన పొత్తు వికటించింది. దీంతో కూటమిలోని అన్ని పార్టీలూ నష్టపోయాయి. అయితే, కోలుకోలేని నష్టం జరిగింది మాత్రం కచ్చితంగా ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికే అని చెప్పాలి. ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ లేదా టీడీపీతో స్నేహపూర్వక పోటీ చేసిన ఆ పార్టీ మిగతా నాలుగు స్థానాల్లో ప్రజాకూటమి తరపున పోటీ చేసింది. ప్రజాకూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన స్థానాల్లో కనీసం రెండో స్థానంలో ఉన్నా ఇతర స్థానాల్లో అయితే రెండో స్థానం కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ పెట్టి ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఇంతటి ఘరో పరాజయంతో ఆ పార్టీ ఏవిధంగా కోలుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల్లో పనిచేయని కోదండరాం ఇమేజ్

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా, పౌర హక్కుల కోసం పనిచేసిన సామాజికవేత్తగా, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఉద్యమాన్ని నడిపించిన నాయకుడిగా ప్రొ.కోదండరాం కి తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపే ఉంది. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రొ.కోదండరాం కొంతకాలానికి ప్రతిపక్షంగా మారిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. దీంతో ఆయన పలుమార్లు బలవంతంగా అరెస్టు కూడా అయ్యారు. ముఖ్యంగా ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టీఆర్ఎస్ కూడా ఆయనను కొన్ని రోజుల్లోనే శత్రువుగా చూడటం ప్రారంభించింది. రాజకీయ పార్టీ ద్వారా అయితేనే టీఆర్ఎస్ తో పోరాడవచ్చని భావించిన కోదండరాం సంవత్సరం క్రితం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన కొందరు సామాజికవేత్తలు మినహా పెద్దగా ఆ పార్టీలో ఎవరూ చేరలేదు. క్షేత్రస్థాయిలో ఎటువంటి క్యాడర్ తయారుకాలేదు.

పొత్తులతో చిన్న పార్టీగా మిగిలిపోయి...

అంతలోనే ముందస్తు ఎన్నికల రూపాన కోదండరాంకి పరీక్ష వచ్చింది. అప్పటికి ఇంకా ఆ పార్టీకి ఎన్నికల గుర్తు కూడా లేదు. అయితే, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆ పార్టీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. పొత్తుల ఖరారు సమయంలో జరిగిన పరిణామాల్లోనే టీజేఎస్ చిన్న పార్టీగా ముద్రపడిపోయింది. స్వయానా కోదండరాం పోటీచేయడానికే టిక్కెట్ దక్కేలేదు. ఆయనకు జనగామ టిక్కెట్ కేటాయించినా బీసీ టిక్కెట్ తీసుకున్నారనే అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ కే ఆ టిక్కెట్ వదిలేశారు. రచనారెడ్డి వంటి క్రియాశీల నాయకులు ఎన్నికల వేళ ఆ పార్టీని విభేదించి తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల కానీ, కోదండరాం పట్ల కానీ ఏమాత్రం సానుకూలత కనిపించలేదు. దీంతో ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై కోదండరాం కసరత్తు చేస్తున్నారు.

ఇక నుంచి ఒంటరి పోరే...

వాస్తవానికి, ఇటీవలి ఎన్నికల్లో టీజేఎస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటేనే మేలు జరిగేదని ఆ పార్టీ ఇప్పుడు భావిస్తోంది. అలా చేసి ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కని బడా నేతలు టీజేఎస్ నుంచి పోటీ చేసి ఉండేవారు. దీంతో సహజంగానే ఎక్కువ ఓట్లు, అవకాశం ఉంటే కొన్ని సీట్లైనా గెలుచుకునేది. పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో నాయకులు తయారయ్యే వారు. ఈ అవకాశాన్ని పొత్తుల ద్వారా టీజేఎస్ కోల్పోయింది. దీంతో ఇక ఒంటరి పోరే మేలనే భావనలో కోదండరాం ఉన్నారు. రానున్న పంచాయితీ ఎన్నికలపై ఆయన దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్యాడర్ ను తయారుచేసుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో బలం సాధించుకోవాలని భావిస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఉన్న నేతలే ఇప్పుడు విశ్రాంతి దశలో ఉన్నారు. మరి, పంచాయితీ ఎన్నికల్లో మరో నెల రోజుల్లోనే జరుగనున్నందున... ఈ నెల రోజుల్లో అద్భుతం జరిగితే తప్ప టీజేఎస్ బలం చాటుకునే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Similar News