కుమారస్వామి నిర్ణయిస్తారట...!

Update: 2018-04-29 17:30 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అమితుమీ జరుగుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఎన్నికల అభ్యర్థిని ఎంపిక చేసే దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కు ముందు కన్నడ నాట జరుగుతున్న సర్వేలు రెండు పార్టీలకూ టెన్షన్ తెప్పిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు మ్యాజిక్ ఫిగర్ ను చేరలేవన్నది సర్వేల సారాంశం. దీంతో జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ఎన్నికల తర్వాత ప్రధాన భూమిక పోషించనున్నారన్న వార్తలు వస్తున్నాయి.

గత సర్వేల్లోనూ....

గతంలో జరిగిన అన్ని సర్వేల్లోనూ కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, జనతాదళ్ ఎస్ మాత్రమే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలు తేల్చి చెప్పాయి. తాజాగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్ అనే సంస్థ సర్వేను కన్నడ నాట నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 105 స్థానాలు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా రాబోతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. మరోవైపు బీజేపీకి 75 నుంచి 85 సీట్లు వచ్చయే అవకాశముందని సర్వేలో తేలింది.

తాజా సర్వేలోనూ హంగ్ అని......

ఇక కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జేడీఎస్ కు ఈ సర్వేలోనూ శుభవార్తే లభించింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు 35 నుంచి 41 సీట్లు రావచ్చని తేల్చింది. దీంతో జేడీఎస్ కీలకంగా మారనుందని సర్వే తేల్చి చెప్పింది. కన్నడనాట ఇప్పటి వరకూ నిర్వహించిన సర్వేల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదని తేల్చి చెప్పడం విశేషం. అన్ని సర్వేల్లోనూ జేడీఎస్ కు 40 సీట్లు వస్తాయని చెప్పడం మరో విశేషం. ఈ సంస్థ 224 నియోజకవర్గాల్లో ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. మొత్తం మీద కన్నడ నాట ఎన్నికలకు ముందు జరుగుతున్న సర్వేలు నిజమవుతాయా? లేదా? అన్నది మరికొంతకాలంపాటు వేచి చూడాల్సిందే.

Similar News