కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత తాను అనుకున్నది సాధించారు. కవిత తొలి నుంచి జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఆమె గత నాలుగేళ్ల నుంచి జగిత్యాలలో పట్టు సంపాదించడం కోసం పావులు కదుపుతున్నారు. అక్కడ సొంతంగా కార్యాలయాన్ని కూడా కవిత ప్రారంభించడం విశేషం. సోదరుడు, మంత్రి కేటీఆర్ ను కూడా జగిత్యాలకు వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించి పార్టీని గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను ఓడించాలన్న రెండున్నరేళ్ల కవిత శ్రమకు ఫలితం దక్కిందంటున్నారు.
బలం పెరగాల్సింది.....
జీవన్ రెడ్డిని ఒక్కడే ఓడించడానికి పిసరు కష్టపడాలి. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి గా ఏర్పడటంతో జీవన్ రెడ్డి మరింత బలోపేతమయ్యారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలవడంతో జీవన్ రెడ్డి తన విజయానికి ఢోకా లేదనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కు మంచి పట్టుంది. టీడీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు లు కలిస్తే ఇక కాంగ్రెస్ కు తిరుగుండదని భావించారు. ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే కాదు రాష్ట్రంలో ఆ నియోజకవర్గం గురించి తెలిసిన వారెవ్వరూ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదు.
వ్యక్తిగతంగా మంచి పేరు.....
జీవన్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచిపేరుంది. ఆయన ప్రజాపక్షపాతిగా ఉంటారన్నది అక్కడి మాట. జీవన్ రెడ్డి సొంత ఇమేజ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, టీడీపీ ఓటు బ్యాంకు కలిస్తే ఇక మెజారిటీ ఎంత అనే లెక్కలోనే జీవన్ రెడ్డి ఉన్నారు. కాని విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకు జీవన్ రెడ్డికి ఎక్సేంజ్ అయిందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను అక్కడి ప్రజలు ఓడిస్తారా? అన్న సందేహాలు కూడా లేకపోలేదు. రమణ, జీవన్ రెడ్డిలు సక్రమంగా ప్రచారాన్ని నిర్వహించకపోవడం వల్లనే ఓటమికి గురికావాల్సి వచ్చిందని, కిందిస్థాయిక్యాడర్ కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేయలేదన్న వాదన గట్టిగా విన్పిస్తుంది.
కవిత నాలుగేళ్ల కష్టం.....
ఇక కె.చంద్రశేఖర్ రావు శాసనసభను రద్దు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత రెండు నెలలు అక్కడే మకాం వేశారు. ప్రతి గ్రామాన్ని టచ్ చేశారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభిస్తామని చెప్పడం, జగిత్యాల అభివృద్ధిని తనకు వదిలేయాలని ప్రజలను పదే పదే కవిత కోరడం కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కు భారీ మెజారిటీ లభించిందంటున్నారు. జగిత్యాలలో పెద్ద యెత్తున నిధులను తెచ్చి అభివృద్ధి పనులు చేయిస్తూ జీవన్ రెడ్డి ఆధిపత్యాన్ని కవిత తగ్గించగలిగారు. మరోవైపు జీవన్ రెడ్డి అనుచరులను ఒక్కొక్కరిగా గులాబీ పార్టీవైపు తిప్పుకోగలిగారు. కవిత నాలుగేళ్ల కృషి ఫలించిందంటున్నారు. సంజయ్ కుమార్ జెయింట్ కిల్లర్ గా నిలిచారంటున్నారు.