బాబు ధ‌ర్మ దీక్షా.... రాజ‌కీయ స్టంటా..?

Update: 2018-04-30 09:30 GMT

రాష్ట్రంలో ఎన్నిక‌ల సీజ‌న్ త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో అధికార ప‌క్షం టీడీపీ దూకుడు పెరుగుతోంది. గ‌త నాలుగేళ్లుగా పెద్ద‌గా అవ‌స‌రం లేద‌న్న ప్ర‌త్యేక హోదా విష‌యంపై నే ఇప్పుడుపోరు చేస్తోంది. అది కూడా ధ‌ర్మ‌పోరాట దీక్ష అని, ధ‌ర్మ దీక్ష స‌భ అని ఇలా ధ‌ర్మాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే, వాస్త‌వానికి కేంద్రంలో అధికార ప‌క్షంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన నాడే చంద్ర‌బాబు ఇలా ఒత్తిడి చేసి హోదా కోసం ప‌ట్టుబ‌ట్టి ఉంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే, వాటిని కొంచెం సేపు ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్ర‌బాబు హోదాను ప్ర‌ధానంగా ఎంచుకున్నారు. (ఎందుకంటే.. ప్ర‌జ‌ల్లో హోదా సెంటిమెంట్ బ‌లంగా ఉండ‌డ‌మే కార‌ణం) ఈ క్ర‌మంలోనే అనేక పోరాటాలు, దీక్ష‌లు అంటూ చేస్తున్నారు. త‌న పుట్టిన రోజునాడే దీక్ష చేసి సింప‌తీ వేట‌లో ప‌డ్డారు.

హోదా కోసం తామేనంటూ....

అయితే, నిన్ను మించిన వాడు నీలోటి నాగ‌న్న‌- అన్న సామెత‌ను గుర్తు చేస్తూ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం బాబును క‌రివేపాకు లెక్క‌న క‌ట్టింది. అయినా చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గ‌కుండా హోదా కోసం పోరాటం చేస్తోంది తామే అన్న‌చందంగా ఆయ‌న ముందుకు వెళ్తున్నారు. తాజాగా తిరుప‌తి వేదిక‌గా చంద్ర‌బాబు ధ‌ర్మ దీక్ష స‌భకు రెడీ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ స్థాయిలో క‌వ‌ర్ చేసేలా బాబు పెద్ద ఎత్తున జాతీయ మీడియాను ఆహ్వానించారు. జాతీయ మీడియా అయితే, తాను చేస్తున్న పోరాటం.. కేంద్రానికి వెంట‌నే తెలుస్తుంద‌ని ఆయ‌న భావించి ఉంటారు.

కేంద్రంపై విరుచుకుపడుతూ....

ఇక‌, స్థానిక మీడియా కూడా బాబుకు అనుకూలంగా ప‌నిచేలా ఆయ‌న చ‌క్రం తిప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.మొత్తంగా బాబు త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే అనే చందంగా వ్య‌వ‌హారం సాగుతోంది. అయితే, కొంద‌రు మేధావులు మాత్రం ఈ ధ‌ర్మ దీక్ష స‌భ వ‌ల్ల ఒరిగేది ఏమిటి? అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే కేంద్రంపై అక్క‌సుతో ఉన్న చంద్ర‌బాబు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. ఇక‌, ఇప్పుడు ధ‌ర్మ దీక్ష స‌భ ద్వారా ఆయ‌న మ‌రింత‌గా కేంద్రంపై విరుచుకుప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు మేధావులు.

ఈ దీక్ష వల్ల ఒరిగేదేంటి?

అయితే, ఈ ప‌రిస్థితి వ‌ల్ల గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. న‌యానా సాధించుకోవ‌డం పోయి.. భ‌యాన సాధించే ప‌రిస్థితి వ‌స్తే.. ఏపీని కేంద్రం ఇరుకున పెట్ట‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిణామం మంచిది కాద‌ని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కేంద్రం ముందు కూడా ప్ర‌త్యేక హోదా కు సంబంధించి ప‌లు రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా బిహార్‌, ఒడిసాలోని కొన్ని ప్రాంతాలు, డార్జిలింగ్ వంటివి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం ఎవ‌రికీ ఇచ్చే ప‌రిస్థితి లేదంటోంది. ఈ విష‌యంలో బాబే గ‌తంలో వెల్ల‌డించారు. మ‌రి ఇప్పుడు చేస్తున్న ఈ దీక్ష స‌భ‌ల వ‌ల్ల ఎవ‌రిని ఉద్ధ‌రించేటట్టు? కేవలం రాజ‌కీయ స్టంటు త‌ప్ప‌!! అంటున్నారు మేధావులు. మ‌రి టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Similar News