నిమ్మల కిష్టప్ప... హిందూపురం పార్లమెంటు సభ్యుడు. ఇప్పుడు ఈయన వ్యవహార శైలితో దాదాపు అందరూ ఎమ్మెల్యేలను క్రమంగా దూరం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు పార్లమెంటు సభ్యులుంటే ఇద్దరిదీ దాదాపు ఇదే పరిస్థితి. జేసీ దివాకర రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కలసి వస్తుండటంతో ఎంపీల వ్యవహారం చర్చనీయాంశమైంది. జేసీ దివాకర్ రెడ్డిపై ఇప్పటికే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారు అధినేతకు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో జేసీ వేలు పెడుతున్నారని మొరపెట్టుకుంటున్నారు. జేసీ ఆగడాలను అరికట్టాలని వీరు గట్టిగా గళం విప్పుతున్నారు.
నిమ్మల కిష్టప్పకు కూడా....
ఇప్పుడు అదే జిల్లాలో మరో ఎంపీ ఎమ్మెల్యేలతో తంటాలు పడుతున్నారు. ఆయనే నిమ్మల కిష్టప్ప. హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వేలుపెట్టడం గత కొన్నాళ్లుగా ప్రారంభించారు. తాను ఎంపీగా వెళ్లినా తన కుమారుడికైనా సీటు వస్తుందన్న గట్టి నమ్మకంతో నిమ్మల కిష్టప్ప ఉన్నారు. అయితే పుట్టపర్తిలో పల్లె రఘునాధరెడ్డి, పెనుకొండలో బీకే పార్థసారథి నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు.
బీకేతో ఢీ అంటే ఢీ....
ఈ ఇద్దరిలో పల్లెపై కొంత వ్యతిరేకత కన్పిస్తున్నా... బీకే పార్థసారథి మాత్రం చంద్రబాబు వద్ద మంచి మార్కులు వేసుకున్నారు. అయితే ఆయన గత నాలుగున్నరేళ్ల నుంచి ఎంపీ నిమ్మలకిష్టప్ప తో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఎన్నిమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం కన్పించడం లేదు. అందుకే నిమ్మలతో నేరుగా ఫైటింగ్ కు దిగారు బీకే పార్థసారధి. వాస్తవానికి ఏడాది క్రితం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బీకే పార్థసారధి పేరు విన్పించింది. పార్టీలో సీనియర్ కావడంతో ఆయనను కేబినెట్ లో తీసుకోవాలని బాబు డిసైడ్ అయ్యారు. అయితే నిమ్మల కిష్టప్ప జోక్యంతోనే తనకు మంత్రి పదవి రాలేదన్నకోపంతో బీకే ఉన్నారు. ఈనేపథ్యంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.
ఒకరిపై ఒకరు ఫిర్యాదు....
పార్టీ కార్యక్రమాలకు కూడా ఒకరి తర్వత ఒకరు హాజరవుతుండటం విశేషం. ఇక నిమ్మల కిష్టప్ప కూడా తన ఎంపీ కోటా నిధులను ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే వినియోగిస్తున్నారు. అయితే బీకే మాత్రం తన నియోజకవర్గంలో ఎంపీ కోటా కింద జరిగే పనులను తన అనుచరులద్వారా అడ్డుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో క్యాడర్ లో గందరగోళం నెలకొంది. దీనిపై ఇప్పటికే తాను అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే బీకే పార్థసారథి చెబుతుండగా, నిమ్మల మాత్రం తాము అసలు విషయాన్ని అధినేత వద్దనే తేల్చుకుంటామని చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నేతల మధ్యవిభేదాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముంది.