ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారీ మెజారిటీతో రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయంగా ఆయన వేసిన ఎత్తులు, అనుసరించిన వ్యూహాలు విజయానికి ఒక కారణంగా నాలుగుసంవత్సరాలా మూడు నెలల పాటు కీలక నిర్ణయాలను అమలు పర్చిన ఘనత ఆ ఆరుగురికే దక్కుతుందంటున్నారు. సంక్షేమ పథకాల అమలు వల్లనే కెసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారన్నది విశ్లేషకుల అంచనా. పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువవ్వడం వల్లనే దాదాపు 98 లక్షల మంది ఓటర్లు కారు గుర్తు బటన్ నొక్కేశారు. ఇందుకు సంక్షేమ పథకాలను అమలుచేసిన తీరు వల్లే ఇంతటి భారీ విజయం గులాబీ పార్టీకి లభించిందని ఇందుకు కేసీఆర్ కోర్ టీమ్ కారణమని చెప్పక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
సంక్షేమ పథకాలను.....
ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడతో పాటు, రాబడి పెంచడంలో కూడా అధికారుల పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రగతి భవన్ లోనే ఉండి ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్న అధికారులకే గులాబీ పార్టీ నేతలు సలాం కొట్టాలన్న కామెంట్స్ జోరుగా విన్పిస్తున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, హరిత హారం, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ నూతన పాలసీ వంటివి టీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చిన నూతన పథకాలు....తీసుకున్న కొత్త నిర్ణయాలు. ముఖ్యమంత్రి ఒక పథకానికి రూపకల్పన చేసినా వాటిన అమలుపర్చాల్సింది అధికారులు మాత్రమే. అయితే కిందిస్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఫాలోఅప్ చేస్తుంది మాత్రం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లోని అధికారులే.
నర్సింగరావు.... రాజశేఖర్ రెడ్డి.....
కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన నర్సింగరావును ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సెక్రటరీగా తీసుకున్నారు. ఆయన సీఎంవోలో కీలకమని చెప్పకతప్పదు. నర్సింగరావు మొత్తం పది విభాగాలను సమన్వయంచేస్తుంటారు. ఫైనాన్స్, ప్లానింగ్, హోంశాఖ, జీఏడీ, ఐటి, విద్యుత్తు, రెవెన్యూ, ఆర్ అడ్ బి, మున్సిపల్ శాఖలతో పాటుగా అనేక శాఖల పథకాలను ఈయన ఫాలో అప్ చేస్తుంటారు. అలాగే మరో కీలక అధికారి రాజశేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను నిత్యం వెన్నంటే ఉంటారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ, విద్య, సీఎం రిలీఫ్ ఫండ్, లా అండ్ ఆర్డర్, ట్రాన్స్ పోర్ట్ శాఖలను చూస్తుంటారు. విద్యా శాఖలో గణనీయమైన మార్పులు తెచ్చారు. సంక్షేమ గురుకులాల ఏర్పాటులో ఈయన కీలక భూమిక పోషించారంటారు. కేసీఆర్ ఆలోచనలను అందిపుచ్చుకోవడంలో దిట్ట.
స్మితా సబర్వాల్.... భూపాల్ రెడ్డి....
ఇక మరో అధికారి స్మితా సబర్వాల్. కరీంనగర్ కలెక్టర్ గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ను ఆమెలో చురుకుదనం, ఆలోచనలను పసిగట్టి కేసీఆర్ తన టీంలో చేర్చుకున్నారు. నీటిపారుదల శాఖ, హరిత హారం, హౌసింగ్, వ్యవసాయ, రెవెన్యూ, భూపరిపాలన శాఖల బాధ్యతలను స్మిత చూస్తున్నారు. స్మిత సబర్వాల్ పనితీరు పట్ల ఒకింత అసంతృప్తిని కేసీఆర్ వ్యక్తం చేసేవారంటారు. భూరికార్డుల ప్రక్షాళన అనుకున్న సమయంలో చేయలేకపోవడం, మిషన్ భగీరధ పనులు వేగవంతంగా పూర్తి కాకపోవడంతో స్మిత సబర్వాల్ పై కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే ఆమె మాత్రం ఫీల్డ్ విజిట్ చేసి ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు అందించడంతో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేశారు.
శాంతకుమారి... ప్రియాంక వర్గీస్....
మరోవైపు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి పేరు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. రిటైర్డ్ అయినా సీఎం తన టీమ్ లో చేర్చుకున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖలో గణనీయమైన మార్పులు తెచ్చిన ఘనత భూపాల్ రెడ్డికే దక్కుతుంది. అలాగే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, హరితహారం, సామాజిక భవనాల నిర్మాణం వంటి వాటిని ఫాలోఅప్ చేస్తూ దిగ్విజయంగా వాటిని గ్రౌండ్ చేయగలిగారు. మరో అధికారి శాంతకుమారి. ఆమె పరిశ్రమలు, వాణిజ్యపన్నులు, ఆదాయపుపన్ను శాఖ లను నిత్యం సమీక్షిస్తుంటారు. ఇక హరితహారాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసి గ్రౌండ్ చేసిన ఘనత మరో ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ కే దక్కుతుంది. మూడు దశలుగా నిర్వహించిన హరితహారం సూపర్ సక్సెస్ కావడానికి కారణం ఈమేనంటారు. మొత్తం మీద గులాబీ పార్టీ జెండా రెండోసారి ఎగరడంలో ఈ ఆరుగురు ఉన్నతాధికారుల సేవలను కూడా ఆ పార్టీ నేతలు కౌంట్ చేస్తుండటం గమనార్హం.