భారమంతా ఈయనపైనే....??

Update: 2018-12-24 17:30 GMT

బీహార్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రెండు ప్రధాన పార్టీలు కూటములతో బలంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా మహాగడ్బంధన్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. బీహార్ లో అధికా స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. లోక్ సభ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీట్ల పంపకాలను కూడా క్రమంగా పూర్తి చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కూడా త్వరలోనే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనుంది. బీజీపీ ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్లను సర్దుబాటు చేసుకుంది.

కీరోల్ ఆయనే.....

బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలున్నాయి. ఇక్కడ ప్రధానంగా జనతాదళ్ యు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కీ రోల్ పోషిస్తున్నారు. జేడీయూ, బీజేపీలు రెండు ప్రశాంత్ కిషోర్ మీదే ఆశలు పెట్టుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ మంచి వ్యూహకర్త కావడం, ఎన్నికల స్ట్రాటజీలను ఖచ్చితంగా అమలు చేయగల నేర్పరితనం ఉండటంతో ఇటు అమిత్ షా, మోదీలు, అటు నితీష్ కుమార్ లు బీహార్ భారమంతా ప్రశాంత్ కిషోర్ మీదనే వేసినట్లు కన్పిస్తుంది.

అన్ని విషయాలు ఆయనకే....

ప్రశాంత్ కిషోర్ చొరవ వల్లే సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిందంటున్నారు. మొత్తం 40 స్థానాలున్న బీహార్ లో 17 స్థానాల్లో బీజేపీ, 17 స్థానాల్లో జేడీయూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక మిగిలిన ఆరు స్థానాలను రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన ఎల్జేపీ పోటీ చేయనుంది. లెక్కలు పక్కాగా ఉండటంతో ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు పర్చాలని ప్రశాంత్ కిషోర్ కు అమిత్ షా, నితీష్ లు బాథ్యతను అప్పగించినట్లు చెబుతున్నారు. రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోర్ దగ్గర కావడంతో అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచార వ్యూహాల వరకూ ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు.

కాంగ్రెస్ కూడా మామూలుగా......

ఇక మహాఘట్ బంధన్ కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలసి లాలూ ప్రసాద్ యాదవ్ కు చెంది. రాష్ట్రీయ జనతా దళ్ కు తోడుగా ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ వచ్చి చేరడంతో మరింత బలోపేతమయింది. ఆర్ఎల్ఎస్సీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం కాకపోయినప్పటికీ త్వరలోనే బీహార్ విషయంలో చర్చలు ప్రారంభించాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీహార్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించడంతో లోక్ సభ ఎన్నికల్లోనూ మొగ్గు తమవైపే ఉంటుందన్న నమ్మకంతో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. మొత్తం మీద బీహార్ లో లోక్ సభ ఎన్నికలు మాత్రం నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగనున్నాయన్నది విశ్లేషకుల అంచనా.

Similar News