సుహాసిని...ఓ క్వశ్చన్ మార్క్....??

Update: 2018-12-04 02:30 GMT

ఎన్టీరామారావు మనవరాలు.. హరికృష్ణ కూతురు... చంద్రబాబు కోడలు... వెరసి సుహాసిని. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూకట్ పల్లి నియోజకవర్గంపైనే ఆసక్తి ఉంది. 119 నియోకవర్గాల మాట అటుంచి ఒక్క కూకట్ పల్లి మీదే సర్వత్రా చర్చ జరుగుతోంది. కూకట్ పల్లి ప్రజాకూటమి అభ్యర్థిని సుహాసిని క్వశ్చన్ మార్క్ అయ్యారు. పాత గణాంకాలు తీసుకుంటే సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకలా ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అలా కన్పించడం లేదు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూకట్ పల్లిలో సుహాసిని పరిస్థితిలో ఏమాత్రం మార్పు కన్పించడం లేదు.

అవసరం.....

సుహాసిని గెలుపు తెలుగుదేశం పార్టీకి అవసరం. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రాణాధారం. ఏమాత్రం గెలుపులో తేడా వచ్చినా చంద్రబాబు పరువు గంగలో కలసి పోతోంది. అందుకే చంద్రబాబు కాలికి బలపంకట్టుకుని మరీ కూకట్ పల్లిలో ప్రచారం చేస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సయితం కూకట్ పల్లి ప్రచారానికి రప్పించారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. సుహాసిని సొంత అన్నదమ్ములు కూడా ఆమె ప్రచారానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి బలమైన కారణాలున్నాయంటున్నారు.

ఎన్టీఆర్ వీరాభిమానిగా....

మరోవైపు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఎన్టీఆర్ కు వీరాభిమాని. అందుకే ఆయన తన కొడుకుకు ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నారంటారు. హరికృష్ణ మరణించిన సమయంలో కేసీఆర్, కేటీఆర్ లు అండగా నిలబడటం, తన తండ్రి స్మారకచిహ్నం నిర్మించడం కోసం 400 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వడం కూడా జూనియర్ ఈ ప్రచారానికి దూరంగా ఉండటానికి కారణంగా కొందరు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ గృహిణిగా ఉన్న సుహాసినిని తమ అనుమతి లేకుండా రాజకీయాల్లోకి లాగడాన్ని కూడా జూనియర్ అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. కుటుంబంలో ఇలా ఉండగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి.

కులాల వారీగా చూసినా.....

ఇక్కడ కమ్మ సామాజికవర్గం తమకు అండగా నిలబడుతుందని టీడీపీ భావిస్తుంది. అయితే ఇక్కడ ఆ సామాజిక వర్గం వాళ్లు ఎక్కువగా వ్యాపార రంగంలో స్థిరపడి పోవడంతో టీఆర్ఎస్ తో తాము ఎందుకు వైరం తెచ్చుకోవాలన్న యోచనలో ఉన్నారు. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు 15 వేలు మాత్రమే ఉన్నాయి. ఇక కాపు అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని, 22 వేల ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా గులాబీ పార్టీ వైపే మళ్లాయన్న వార్తలు టీడీపీ నేతలకు నిద్రపట్టనివ్వడం లేదు. మరోవైపు ముస్లిం ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతోరనన్న ఉత్కంఠ లేకపోలేదు. అందుకే చంద్రబాబు కూకట్ పల్లి పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అవగాహన, అనుభవం లేని సుహాసినికి ఓటేయడం వల్ల ఉపయోగమేముంటుందన్న ఆలోచన కూకట్ పల్లి వాసల్లో బయలుదేరితే ఆమె గెలుపు కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి ఇక్కడి సెటిలర్లు ఓటేస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే. మొత్తం మీద ఇప్పుడు కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణాలోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

Similar News