తమిళ ‘‘సై’ అంటారా…?

తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సౌందర రాజన్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. [more]

Update: 2019-09-08 00:30 GMT

తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సౌందర రాజన్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటి వరకూ తమిళ సై కేవలం భారతీయ జనతా పార్టీ నేతగానే తెలుసు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవిలోకి తమిళ సై రాబోతున్నారు. తమిళ సై గవర్నర్ గా నియమితులయ్యేవరకూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా అందరికీ సుపరిచితమే. తమిళనాడులో భారతీయ జనతాపార్టీ లేకపోయినా ఆపార్టీకి కొంత ఊపును తమిళ సై తెచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అంచెలంచెలుగా ఎదిగి….

భారతీయ జనతా పార్టీలో తమిళ సై సౌందర రాజన్ అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో ఆమె ప్రస్థానం కార్యకర్త స్థాయి నుంచి మొదలయింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా తమిళసై పనిచేశారు. తమిళనాడులో అనేక సార్లు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. మూడు సార్లు ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేసిన తమిళసై ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. తమిళనాడులో ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే బలంగా ఉన్నప్పటికీ ఆమె పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు.

తండ్రి నుంచే రాజకీయాలు….

తమిళసై 1961లో జన్మించారు. ఆమె స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి జిల్ా నాగర్ కోయిల్. తమిళసై తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్ లో ప్రముఖ నేతగా ఉండేవారు. ఆయన పార్లమెంటుసభ్యుడిగా కూడా ఉన్నారు. తండ్రి నుంచే రాజకీయ ఓనమాలను తమిళసై నేర్చుకున్నారు. తండ్రి ఫక్తు కాంగ్రెస్ వాది అయినప్పటికీ ఆమె మనసు మాత్రం బీజేపీ వైపు లాగింది. తమిళ సై మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ యూనివర్సిటీలో గైనకాలజీలో పీజీ చేశారు. వైద్యురాలిగా మంచి పేరుతెచ్చుకున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తమిళ సై అవసరమైనప్పుడు శస్త్ర చికిత్సలకు అటెండ్ అయ్యేవారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఆరోగ్య విషయాలపై చైతన్యం తెచ్చేందుకు తమిళసై కృషి చేశారు.

రాజ్యాంగ బద్ధంగానే…..

తమిళసై భర్త సౌందర్ రాజన్ కూడా వైద్యులే. భర్త ప్రోత్సాహంతోనే ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తుండటంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం కొంత కలవరపడుతుంది. బీజేపీ నేతగా ఉన్న గవర్నర్ కావడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఆందోళన అధికార పార్టీలో లేకపోలేదు. తాను మాత్రం రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటానని తమిళ సై చెబుతున్నారు. మొత్తం మీద కొత్త గవర్నర్ రాకతో తెలంగాణలో రాజకీయ మార్పులు చేసుకుంటాయన్న ఊహాగానాలు సయితం విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News