జెట్ స్పీడ్ లో టీఆర్ఎస్... ఫ్లైట్ మోడ్ లో కాంగ్రెస్..!

Update: 2018-12-20 03:30 GMT

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతల్లో ఆనందాన్ని నింపగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తెలంగాణలో ఈసారి అధికారం ఖాయమని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలకు ఊహంచని షాక్ తగిలింది. కేవలం 19 సీట్లకే ఆ పార్టీ పరిమితం కావడం ఒక షాక్ అయితే హేమాహేమీల్లాంటి నేతలు ఓడిపోవడం ఆ పార్టీ నాయకులు, క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడిచినా ఇంకా కాంగ్రెస్ నేతలు ఎవరూ పరాజయం నుంచి తేరుకోనట్లున్నారు. అయితే, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అతి త్వరలో రెండు మరో రెండు పరీక్షలు ఎదురుకాబోతున్నాయి. పంచాయితీ ఎన్నికలు వచ్చే నెలలోనే జరిగే అవకాశం ఉండగా, ఫిబ్రవరి 25న పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచే ఇంకా కోలుకోని కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కుంటారో అర్థం కావడం లేదు.

ముంచుకొస్తున్న పంచాయితీ

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చే నెలలోనే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇవి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే అయినా పార్టీలు బలపరిచిన అభ్యర్థులే పోటీలో ఉంటారు. అయితే, సహజంగానే అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక సంస్థల్లో మొగ్గు ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ప్రజలు స్థానిక సంస్థల్లో అదే పార్టీ వైపు ఎక్కువగా ఉంటారు. దీంతో టీఆర్ఎస్ కి పెద్ద కష్టమేమీ ఉండదు. అయినా, ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ పంచాయితీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా పంచాయితీ ఎన్నికలకు ఏమాత్రం సద్ధంగా లేరు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్న ఆ పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపాల్సిన పార్టీ పెద్దలు ఆ విధంగా ఏం చర్యలు తీసుకోవడం లేదు. గ్రామ స్థాయిలో క్యాడర్ ను కాపాడుకునేందుకు నియోజకవర్గ స్థాయి నేతలకు పంచాయితీ ఎన్నికలు కీలకం. అవసరమైతే వారే ఖర్చు పెట్టుకుని తమ వారిని గెలిపించుకోవాలి. కానీ, ఇప్పటికే అసెంబ్లీలో ఖర్చు పెట్టినా ఓడిన వారు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తెస్తున్నారట. దీంతో క్యాడర్ కు దిక్కుతోచడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పంచాయితీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

కొన్ని ఎంపీ సీట్లపైనా ఆసక్తి...

ఇక పంచాయితీ ఎన్నికలు ముగియగానే పార్లమెంటు ఎన్నికల రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ కి మరో పరీక్ష ఎదురుకానుంది. ఇటీవలి ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి, రేణుక చౌదరి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక మహబూబాబాద్ లో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ బరిలో ఉండనున్నారు. కొద్దిగా కష్టపడితే భువనగిరి స్థానాన్ని సైతం కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నందున ఈ స్థానం నుంచి గూడురు నారాయణరెడ్డి బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

జానారెడ్డి కూడా.....

ఇక నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, జానారెడ్డి కూడా పోటీకి మొగ్గు చూపే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నా... ఇటీవలి ఎన్నికల్లో ఓడిన డీకే అరుణ, రేవంత్ రెడ్డి కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. కరీంనగర్ లో సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక, మిగతా స్థానాల్లో పోటీకి మాత్రం ఎవరూ అంత ఉత్సాహంగా లేనట్లు కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాల్లో ఇటీవల టీఆర్ఎస్ హవా భారీగా ఉండటంతో పోటీకి నేతలు అంత ఉత్సాహంగా లేరంటున్నారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండదని, కేంద్ర రాజకీయాల ప్రభావంతో గెలిచే అవకాశం ఉంటుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి, ఒక పరీక్షలో ఫెయిల్ అయితేనే ఢీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ త్వరలో ఎదుర్కోనున్న రెండు పరీక్షల్లో ఏ మేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Similar News