మిషన్ మెజారిటీ… ఇదే దుబ్బాకపై టీఆర్ఎస్ స్ట్రాటజీ

దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఎన్నికల సందడి కూడా మొదలయింది. నవంబరు 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి [more]

Update: 2020-10-07 11:00 GMT

దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఎన్నికల సందడి కూడా మొదలయింది. నవంబరు 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా, ముఖ్మమంత్రి సొంత జిల్లా కావడం కూడా ఆ పార్టీకి గెలుపు ఖచ్చితంగా అవసరం. రామలింగారెడ్డి మరణం తర్వాత నుంచే అక్కడ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించింది.

త్రిముఖ పోటీ…

దుబ్బాక ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని గ్రామాల్లో బాధ్యులను నియమించి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. ఇక మంత్రి హరీశ్ రావు అయితే పూర్తిగా దుబ్బాకలోనే ఉంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే మరో సిద్ధిపేట చేస్తానని హరీశ్ రావు పదే పదే చెబుతున్నారు. ఇక త్వరలో మంత్రులకు కూడా మండలాల వారీగా బాధ్యతలను అప్పగించనుంది టీఆర్ఎస్ అధిష్టానం.

నల్లేరు మీద నడకే…..

నిజానికి ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడం, సంక్షేమ పథకాలను అమలుపరస్తుండటంతో గెలుపు గ్యారంటీ అన్న ధీమాలో టీఆర్ఎస్ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా మూడున్నరేళ్ల కాలపరిమితి ఉంది. కాంగ్రెస్ కు ఓటేసి ఇప్పడు సాధించేదేంటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. టీఆర్ఎస్ కు ఓటేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్న భావనలోనే సహజంగా ఓటరు ఉంటారు.

కాంగ్రెస్, బీజేపీలు….

ఇక బీజేపీ కూడా ఇక్కడ పోటీలో ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలో ఓట్లను చీల్చుకుంటే అది అధికార పార్టీకే లాభిస్తుంది. ఇటీవల మరణించిన రామలింగారెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు విజయం సాధించారు. 2004, 2008 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన రామలింగారెడ్డి కుటుంబం నుంచే టీఆర్ఎస్ బరిలోకి దిగుతుండటంతో ఈ ఎన్నికల వన్ సైడ్ గానే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఇక రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ లో ఎవరు ఉంటారన్నది ఇక్కడ తేలాలంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీ దుబ్బాక ఉప ఎన్నికపై బిందాస్ గా ఉన్నా, మెజారిటీ కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News