తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు స్వీకరించారు. ఇక నుంచి టీఆర్ఎస్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకోనున్నారు. అయితే, ఇది కేవలం మొదటి అడుగేనని, త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమనే ప్రచారం పార్టీలోనూ, బయట కూడా విస్తృతం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు లేదా తర్వాత... అంటే కేవలం ఆరునెలల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. కానీ, కేటీఆర్ ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు కొట్టి వేస్తూ వస్తున్నారు. మరో 15 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కాకున్నా భవిష్యత్ లోనైనా కేటీఆర్ బావి నాయకుడని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయనను మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. 11వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి నేడు ఆయన కేటీఆర్ బాధ్యతలు తీసుకునే వరకు పరిణామాలను గమనిస్తే ఇది స్పష్టమవుతోంది.
భవిష్యత్ కేటీఆర్ దేనని...
రాజకీయ నాయకులు భవిష్యత్ ని సరిగ్గా అంచనా వేస్తేనే వారి భవిష్యత్ కి ఢోకా ఉండదు. పరిస్థితులను సరిగ్గా పసిగట్టగలిగిన వారికి రాజకీయంగా తిరుగుండదు. ఈ విషయంలో చాలామంది టీఆర్ఎస్ నాయకులు ముందే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక భవిష్యత్ అంతా కేటీఆర్ దేనని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. నియోజకవర్గ స్థాయి నేతల నుంచి సీనియర్ నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు కూడా కేటీఆర్ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఆయన అధికారికంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు తీసుకున్నా గత కొన్నేళ్లుగా పార్టీ వ్యవహారాల్లో ఆయన చాలా కీలకంగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారులో కూడా కేటీఆర్ పాత్ర ఎక్కువగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుని ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన కేటీఆర్ సక్సెస్ అయ్యి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. దీంతో వెంటనే ఆయనకు వర్కింగ్ ప్రసిడెంట్ హోదాను కేసీఆర్ కట్టబెట్టారు.
ప్రకటనలు... బాలప్రదర్శనలతో...
ఎన్నికల ఫలితాలు వచ్చిన 11వ తేదీ నుంచే గెలిచిన వారు, ఓడిన వారు, టిక్కెట్లు దక్కని వారు, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు... ఇలా అందరూ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ విజయం సాధించినందున కేటీఆర్ ను కలిసి రెండు రోజుల పాటు అభినందనలు తెలిపారు. ఇక, అంతలోనే వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమితులవ్వడంతో నేతలంతా బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు తెల్లవారగానే కేటీఆర్ చుట్టూ చేరుతున్నారంట. హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగులు, ప్రతిరోజుల పేపర్లు, టీవీల్లో పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తూ కేటీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశించే వారైతే ఇందులో ఇంకా ముందున్నారు. నిన్న ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సమయంలోనూ నేతల హడావుడి మామూలుగా లేదు. ఎక్కడ వెనకబడి పోతామోనని ఒకరిని చూసి ఒకరు బలప్రదర్శన చేశారు. పెద్దఎత్తున అనుచరులతో తెలంగాణ భవన్ కి వచ్చి బలప్రదర్శన చేశారు. ఎక్కువగా హైదరాబాద్ కి చెందిన నేతలు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడంలో ముందున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ను మచ్చిక చేసుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. అయితే, రాజకీయం ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలిగే గుణాన్ని తండ్రి వారసత్వంగా అందుకున్న కేటీఆర్ కి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసంటున్నారు.