జాగో...జగన్...జాగో...!!

Update: 2018-12-05 01:30 GMT

అవును! ఇది ఎవ‌రో గిట్ట‌ని వారు.. అధికార పార్టీ నేత‌లు అంటే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, వైసీపీకి క‌ర‌డు గ‌ట్టిన అభిమానులు, వైఎస్ అబిమానులు, ఆయ‌నను దేవుడిగా చూసుకునే ఓ వ‌ర్గం ప్ర‌జ‌లే చెబుతున్నారు. మునుపు ఉన్న దూకుడు వైసీపీలో ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అది కూడా ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల ముందు వైసీపీ నిర్వ‌హిస్తున్న ఏ కార్య‌క్ర‌మానికీ మునుపు ఉన్నరేంజ్‌లో స‌క్సెస్ రేటు కాన‌రావ‌డం లేదు. తాజాగా వంచ‌న‌పై గ‌ర్జ‌న పేరుతో పెద్ద కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అయితే, ఎక్క‌డా దాని తాలూకు విష‌యం రాష్ట్రంలో చ‌ర్చ‌కు రాలేదు. ఎన్నిక‌ల ముంగిట వైసీపీ నేత‌లు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు అస్స‌లు రావ‌డం లేదు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నాయ‌కులు గ‌తంలో మీడియా ముందుకు వ‌చ్చే వారు.

టీడీపీ, జనసేనలు....

ఇప్పుడు అదికూడా లేదు. కానీ, అదే టీడీపీలో చూస్తే.. అధికార ప్ర‌తినిధులు మంత్రులు ఏదైనా విష‌యంపై స్పందిస్తు న్నారు. ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేసుకుంటున్నారు. చాప‌కింద నీరులా స‌భ్య‌త్వ న‌మోదును వేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో టీడీపీపై చ‌ర్చ సాగుతోంది. ఇక‌, జ‌న‌సేన విష‌య‌మూ అలానే ఉంది. ప‌వ‌న్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో పాజిటివో నెగిటివో ఓ చ‌ర్చ జ‌రుగుతోంది.ఇది పార్టీని ప్ర‌జ‌ల నాలుక‌ల‌పై నిల‌బెడుతోంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ ఈ విష‌యంలో చాలా వెనుక‌బ‌డిపోతున్నా రనే వ్యాఖ్య‌లు మాత్రం బ‌లంగా వినిపిస్తున్నాయి. విశాఖ‌లో జ‌రిగిన హత్యాయత్నం సంఘటనను పార్టీకి సానుకూలంగా మ‌లుచుకోలేక‌పోయారు.

ఏదీ తన ఖాతాలో....

శ్రీకాకుళంలో వ‌చ్చిన తుఫానుకుస‌రైన మౌలిక స‌దుపాయాలు లేక‌, ఇప్ప‌టికీ బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు ఈ విష‌యాన్ని కూడా వైసీపీ త‌న ఖాతాలో వేసుకోలేక పోయింది. ఇక‌, జ‌గ‌న్ మాతృమూర్తి.. విజ‌య‌మ్మ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లలేక పోయారు. పార్టీకి యూత్‌ను చేరువ చేసే కార్య‌క్ర‌మం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ముందుకు రావ‌డం లేదు. గ‌తంలో జ‌రిగిన కాల్‌మ‌నీ ఉదంతం కానీ, ఇసుక మాఫియాకానీ, పోల‌వ‌రం అవినీతిపై కానీ, అమ‌రావ‌తి నిర్మాణాల‌పై కానీ, స‌చివాలయంలో నీరు కార‌డం కానీ.. ఇలా ఏ ఒక్క విష‌యాన్ని కూడావైసీపీ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోలేక పోతోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌చేస్తున్నారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ నేతలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలోనూ,నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూకొంత వెనకబడ్డారనే చెప్పాలి. మ‌రి ఇప్ప‌టికైనా ఫైర్ బ్రాండ్‌లుగా పేరు ప‌డ్డ నాయ‌కుల‌ను రంగంలోకి దింపి పార్టీలో ఉత్తేజాన్ని నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Similar News