సభలో దుడుకుగా వ్యవహరించే సభ్యుల విషయంలో సస్పెన్షన్లు వేటు వేసే పద్ధతిలో చిన్న మార్పులు చేసి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని అమలుచేస్తున్న తీరు అసెంబ్లీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. సభ ప్రారంభమైన రెండోరోజే 11 మంది విపక్ష సభ్యుల మీద సస్పెన్షన్ వేటు పడడం ఒక రకంగా విపక్ష సభ్యుల్లో ఆందోళన పుట్టిస్తోంది. దీన్ని బట్టి చూస్తే మారిన నిబంధనలు సభ్యుల్లో క్రమశిక్షణ విషయంలో మంచి మార్పునే తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి.
ఈసారి అసెంబ్లీ సమావేశాల విషయంలో కేసీఆర్ సర్కారు ముందే ఒక నిర్ణయం తీసుకున్నది. సభ్యులు తమ సీట్లు వదలి వెల్ లోకి దూసుకురావడం, అక్కడనిరసనలు వ్యక్తం చేయడం వంటివి జరిగితే ఒకరోజు సస్పెన్షన్, మరో రోజు కూడా అదే మాదిరిగా ప్రవర్తిస్తే వారం రోజుల సస్పెన్షన్, మూడో రోజూ అదే మాదిరి క్రమశిక్షణ ఉల్లంఘన జరిగినట్లయితే సెషన్ ముగిసేవరకు సస్పెన్షన్ లు విధించాలని ముందే నిర్ణయించారు. సభాగౌరవాన్ని, క్రమశిక్షణను కాపాడడానికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బీఏసీ సమావేశంలోనే ఈ ప్రతిపాదనల్ని ప్రస్తావించి ఓకే అనిపించారు.
ఈ క్రమశిక్షణల అస్త్రాలు ప్రయోగించడం సభలో రెండో రోజే మొదలైపోయింది. తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు ఏకంగా 11 మంది సభ్యులను సస్పెండ్ చేసేశారు. వీరిలో ఇద్దరు తెలుగుదేశం వారు కాగా, మిగిలినది కాంగ్రెస్ సభ్యులు.
దండం దశగుణం భవేత్ అన్న సామెత చందంగా నిర్దాక్షిణ్యంగా సస్పెన్షన్ వేటు వేసేస్తుండడం అనేది వారిలో కాస్త భయాన్ని పుట్టిస్తున్నట్టే ఉంది. నెలాఖరు వరకు సభ జరుగుతుందని కేసీఆర్ ప్రకటించారు గానీ... ఇలాంటి వెల్ లోకి వెళ్లే ఘటనలు, సస్పెన్షన్లు మరో రెండుసార్లు జరిగితే.. తమకు సభాప్రవేశం ఉండదని వారు భయపడుతున్నారు. తాను కనీసం సీటులోంచి లేవకపోయినా కూడా.. ఇతర సభ్యులను సభా కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రోత్సహించానంటూ నెపం పెట్టి తనను సస్పెండ్ చేయడం దారుణం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క ఆవేదన వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఏ సభ్యుడి ప్రసంగాన్ని కూడా తాను అడ్డుకోలేదని ఆయన అంటున్నారు.
టీవీ ఫుటేజీలు సభ ముందు పెట్టాలని, లేదంటే మంత్రి హరీశ్ రావుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం అని మల్లు బెదిరిస్తున్నారు. అవన్నీ కార్యరూపంలో ఎలా అవుతాయో గానీ.. మొత్తానికి సభలో ఆందోళనలు చేయడం హద్దు దాటి ప్రవర్తించడంపై విపక్షసభ్యుల్లో ఈ సస్పెన్షన్లు కాస్త జడుపు పుట్టించాయనే చెప్పాలి.