ప్రత్యేక హోదా ఏపీకి ఎందుకు దక్కలేదు?

Update: 2017-01-24 03:55 GMT

ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా ప్రధానమైనది. నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సభలో ఏపీ పునర్విభజన చట్టం అమోదం పొందిన తర్వాత రాజ్యసభలో కొద్దిపాటి చర్చ జరిగింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోతుందనే భావనతో కొద్ది పాటి ఊరట కల్పించేందుకు సభ్యులు లేవనెత్తిన అంశాలకు ప్రధాని హోదాలో ప్రత్యేక హోదాను ప్రకటించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పునర్విభజన చట్టం సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా., సెక్షన్‌ 94 ప్రకారం పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు, రెవిన్యూ లోటు భర్తీ ఐదేళ్ల పాటు ఆంధ‌్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ 2014 సెప్టెంబర్ 20వ తేదీన విభజన చట్టాన్ని రాజ్యసభ అమోదించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు నాటకీయ మలుపులు తిరిగాయి. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం ఏపీలో రాజకీయంగా సెగ పుట్టిస్తున్న నేపథ్యంలో హోదా-ప్యాకేజీల కథాకమామిషు ఏమిటో ఒకసారి చూద్దాం.....

నిధుల కేటాయింపు ఇలా...

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులలో కొంత భాగం తిరిగి రాష్ట్రాలకు ఇస్తుంది. వీటిని ప్రణాళిక., ప్రణాళికేతర నిధుల కింద కేటాయిస్తారు. ప్రణాళికేతర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు., సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. ఈ నిధుల్ని ఐదేళ్లకోమారు ఏర్పాటయ్యే ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేటాయిస్తారు. ప్రతి ఆర్ధిక సంఘం అది ఎంచుకున్న ప్రమాణాలు., లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య నిధులు పంచిపెడతాయి. ఈ లెక్కలు., వాటి ప్రాధాన్యతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

ప్రణాళిక సంఘం స్థానంలో నీతిఆయోగ్....

ఇక ప్రణాళిక నిధుల్ని ప్రణాళికా సంఘం కేటాయిస్తుంది. ప్రతి పంచవర్ష ప్రణాళికలోనూ వేర్వేరు ప్రాధాన్యతలను ఎంచుకుంటారు. ఈ నిధులు రహదారులు., ఇరిగేషన్‌ వంటి అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ప్రణాళిక వ్యయం కింద అదనపు నిధులు పొందుతాయే తప్ప.., ఈ సడలింపు ప్రణాళికేతర నిధులకు వర్తించదు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చింది.

ఏ రాష్ట్రాలకు హోదా దక్కింది....

ఇక హోదా విషయానికొస్తే దేశంలో మొదటి సారి 1968లో ప్లానింగ్ కమిషన్ నాగాలాండ్, అస్సోం., జమ్మూ కశ్మీర్‌లలో ఉన్న విభిన్న భౌగోళిక పరిస్థితులు., సరిహద్దు చొరబాట్లు., వెనుకబాటు తనం., కొండ ప్రాంతాల అభివృద్ధి వంటి కారణాలతో ప్రత్యేక గ్రాంట్‌ను కేటాయించింది. 1973 నాటికి దీనిని మరో 7 రాష్ట్రాలకు విస్తరిస్తూ 5వ పంచవర్ష ప్రణాళిక నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని సరిహద్దు రాష్ట్రాలు., ఈశాన్య రాష్ట్రాలు., కొండ ప్రాంతాలకు ఇచ్చినట్లైంది. అయితే ప్రత్యేక హోదా పేరుతో నిధుల కేటాయింపు జరుగుతున్నా అవి సక్రమంగా వినియోగించకపోవడాన్ని గుర్తించిన కేంద్రం 1992లో ప్రణబ్ ముఖర్జీ ప్రణాళికా సంఘం ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గాడ్గిల్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా గాడ్గిల్ -ముఖర్జీ ఫార్ములా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేటాయించే ప్రణాళిక నిధుల్లో 30శాతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. మిగిలిన 70శాతం ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. 2002లో యూపీ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడినపుడు ఆ రాష్ట్రం కొండ గుట్టలతో నిండి ఉండటం., వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో హోదా ఉన్న రాష్ట్రాల సంఖ్య 11కు చేరింది.

ఉత్తరాఖండ్‌కు ఈ విధానం.....

కేంద్ర క్యాబినెట్ నోట్‌ ద్వారా ప్లానింగ్ కమిషన్‌కు సూచన పంపింది. ఆ సూచన మేరకు రాష్ట్ర పరిస్థితులను అన్నింటికి విశ్లేషించి కేంద్ర క్యాబినెట్‌కి నివేదిక ఇచ్చింది. కేంద్ర క్యాబినెట్‌ అమోదం పొందిన తర్వాత ఆ నివేదికను జాతీయ అభివృద్ధి మండలి ముందు ఉంచారు. జాతీయ అభివృద్ధి మండలి అమోదం తర్వాత ఉత్తరాఖండ్‌ను ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంగా ప్రకటించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మాత్రం అలా జరగలేదు.రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర క్యాబినెట్లో తీర్మానం చేశారు. ప్లానింగ్‌ కమిషన్‌కు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కాని అధ్యయనం జరిపి జాతీయ అభివృద్ధి మండలి అమోదం పొందేలోపు కేంద్రంలో ప్రభుత్వం మారిపోయింది.

ప్రత్యేక హోదాతోపన్ను రాయితీలు ఇలా.....

దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు 1968 నుంచి మనుగడలో ఉన్నాయి. కానీ పన్ను రాయితీలు 2002 తర్వాతే అమల్లోకి వచ్చాయి. అప్పట్లో వాటికి పన్ను రాయితీలు ఎందుకిచ్చారంటే ఈశాన్య రాష్ట్రాల్లో కొండ ప్రాంతాలు., సరిహద్దు రాష్ట్రాల్లో చొరబాట్లు., అస్థిరత అభివృద్ధికి దూరంగా ఉండిపోవడంతో పరిశ్రమలు కూడా ఉండేవి కాదు. ఉగ్రవాదం., తీవ్రవాదం., తిరుగుబాటుతనం పెరిగిపోవడంతో యువతను సరైన దారిలో నడిపించేందుకు పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు 2002లో ఐదేళ్ల కాల వ్యవధితో ఈశాన్య రాష్ట్రాలకు రాయితీలు ప్రకటించారు. 2005లో ఉత్తరాఖండ్., హిమాచల్‌ ప్రదేశ్‌లకు కూడా రాయితీలు కల్పించారు. నిజానికి ఈ రాయితీలకు గడువు 2007.,2010లో ముగియాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలతో మొదట ఐదేళ్లు., ఆ తర్వాత రెండేళ్లు పొడిగించారు. ఆ తర్వాత గడువు పొడిగించలేదు. ఫలితంగా 2014లో ఎనిమిది రాష్ట్రాలకు పన్ను రాయితీ రద్దైంది. ఉత్తరాఖండ్., హిమాచల్ ప్రదేశ్‌., జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు 2017 నుంచి పన్ను మినహాయింపు రద్దు కానుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలను ఉపసంహరించినా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోంది. అవి కొండ ప్రాంతాలు., సరిహద్దు రాష్ట్రాలు కావడంతో హోదా కొనసాగుతోంది.

ప్రత్యేక హోదాతో కలిగే సదుపాయాలు., 2014 నుంచి అమల్లోకి వచ్చిన నిధుల కేటాయింపు విధివిధానాలు., ఏపీ ఎలా నష్టపోతుందో మరో భాగంలో చూద్దాం......

Similar News