మెగాస్టార్ గొంతు మూగవోయిందా?

Update: 2017-01-27 15:37 GMT

మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు వింటేనే లక్షలాది మంది అభిమానులు వెర్రెత్తిపోతారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఫ్యాన్స్ కు ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మంచి కిక్ ఇచ్చాడుమెగాస్టార్. కలెక్షన్ల రికార్డులు కూడా బద్దలు కొట్టారు. అలాంటి మెగాస్టార్ ఇప్పడు సోషల్ మీడియాలో వివాదంగా మారాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ యువత ఈ నెల 26వ తేదీన ఆర్కే బీచ్ లో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనకు టాలివుడ్ యంగ్ హీరోలందరూ మద్దతు తెలిపారు. ట్వీట్ల ద్వారా ఉద్యమానికి సపోర్ట్ చేశారు. తెలంగాణకు చెందిన హీరో సంపూర్ణేష్ బాబు ఏకంగా విశాఖకు వచ్చి అరెస్ట్ అయ్యారు. తమ్మారెడ్డి భరధ్వాజ కూడా యువతకు సంఘీభావాన్ని తెలిపేందుకు ఉక్కునగరానికి వచ్చారు. కాని ఇప్పడు మెగాస్టార్ గా ఏపీలో లక్షలాది మంది అభిమానులున్న చిరంజీవి ఈ అంశంపై ఎందుకు స్పందించలేదన్న చర్చ జరుగుతోంది.

చిరు కాంగ్రెస్ లోనే ఉన్నారా?...

చిరంజీవి కేవలం సినిమా హీరోనే కాదు. రాజకీయాల్లోకి కూడా వచ్చారు. ప్రజారాజ్యం పెట్టి దానిని కాంగ్రెస్ లో కలిపేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మంత్రి పదవినీ చేపట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు చిరంజీవి ఏపీకి కావాల్సిన హక్కులకన్నా, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు విన్పించాయి. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికే మెగాస్టార్ ఆ ప్రతిపాదనను హైకమాండ్ ముందుంచారని అప్పట్లో కథనాలుకూడా వెలువడ్డాయి. కాని అప్పటి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ నెలలోనే రిలీజ్ అయిన ఖైదీ నెంబరు 150 చిత్రంపై మెగాస్టార్ ప్రతి చానెల్ కు ఇంటర్వ్యూలు తన సమయాన్ని వెచ్చించి మరీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. బీజేపీలో చేరేది లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటీవల అనేక ఆందోళనలు చేపట్టినా అందులో చిరు ఫేస్ కన్పించలేదు. పైగా ఏపీకి చెందిన చిరంజీవి అక్కడప్రత్యేక హోదా కోరుతూ చేస్తున్న ఉద్యమానికి మద్దతు కూడా తెలపలేదు. పైగా బిజీగా సినిమా షూటింగ్ లో ఉన్నారంటే అదీలేదు. ఓ ప్రయివేటు ఛానెల్ లో వస్తున్న ప్రోగ్రాం ఎపిసోడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారని

చెబుతున్నారు. ఇంతకీ ఏపీకి ప్రత్యేక హోదా రావడం చిరుకు ఇష్టం లేదా? లేక బీజేపీలో చేరే ప్రయత్నాలు మెగాస్టార్ చేస్తున్నారా? ఇవే సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. పైగా చిరంజీవి స్పందిస్తే ఆయన ఇంట్లో మరో హీరో రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించేవారంటున్నారు. కేవలం నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధర్మ తేజ్ లు మాత్రమే ఏపీ స్పెషల్ స్టేటస్ కు మద్దతిచ్చారు. ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. చిరు ఎందుకు స్పందించలేదనేదే ఇప్పడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం మెగాస్టార్ మాత్రమే చెప్పగలరు.

Similar News