మేము లోకల్...

Update: 2017-01-29 00:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా సమాజ్ వాదీ పార్టీతో కలసి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ రోజుకో కొత్త ఎత్తులతో ముందుకు కదులుతోంది. దేశరాజధానికి దగ్గర దారి ఉత్తరప్రదేశ్ కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సవాలుగా తీసుకుంది. మోడీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు దిగింది. మోడీ తప్ప ఎవరొచ్చినా పరవాలేదన్న కసి ఆ పార్టీ నేతల్లో కన్పిస్తోంది. అందుకే కాంగ్రెస్ కొత్త నినాదంతో ముందుకొచ్చింది. ‘మన కుర్రోళ్లు - బయట మోడీ’ (అప్నే లడ్ కే - బహ్రీ మోడీ) అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. యూపీ ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కలసి కొన్ని సభల్లో ప్రచారం చేయనున్నారు. వీరిద్దరూ యూపీ ప్రాంతానికే చెందిన వారని, మోడీ బయట వ్యక్తి అన్న స్లోగన్ ను వీలయినంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.

యువ ఓటర్లకు గాలం....

కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా యూపీలో అడుగులు వేస్తోంది. యూపీ లోని అమేధీ, రాయబరేలీ నుంచే సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో యూపీని తమ సొంత ప్రాంతంగా ప్రకటించుకుని ప్రచారంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దించారు. అఖిలేష్, రాహుల్ లు కలిసి అనేక సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక, డింపుల్ యాదవ్ లతో సుమారు 20 చోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. దీనివల్ల మహిళా ఓటర్లు తమవైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్ భావిస్తోంది. యూత్ ను తమవైపుకు తిప్పుకునేందుకే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీలో 18 శాతం ఓట్లున్న ముస్లింలపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ముస్లిం ఓట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కాంగ్రెస్, ఎస్సీ మాత్రం తమకు ప్రధాన పోటీ దారుగా బీజేపీనే భావిస్తున్నారు. అందుకే మోడీని టార్గెట్ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ‘మేము లోకల్’ అనే నినాదం కాంగ్రెస్, ఎస్పీలను విజయతీరాలకు చేరుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. అయితే మోడీ ప్రస్తుతం యూపీలోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది.

Similar News