రెండు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను పరిష్కరించేందుకు రాజ్ భవన్ జరిగిన సమావేశంలో ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల ప్రతనిధులతో చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయి. కోర్టులు, అధికారుల కన్నా గవర్నర్ నరసింహన్ ఎదుటే సమస్యలను పరిష్కరించుకోవడం మేలన్న అభిప్రాయానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు. ప్రధానంగా తొమ్మిది, పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థలు, ఉద్యోగుల సమస్యలు, హైకోర్టు విభజన వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ చెప్పిన అంశాలను పరిశీలించి తిరిగి ఈ నెల 9వ తేదీన మళ్లీ ఒకసారి భేటీ అయ్యేందుకు రెండు రాష్ట్రాల మంత్రులూ అంగీకరించారు.
మరోసారి ఈ నెల 9న భేటీ....
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన మూడేళ్లుగా పరిష్కారానికి నోచుకోకపోవడంతో గవర్నర్ నరసింహన్ జోక్యంతో బుధవారం రాజ్ భవన్ లో రెండు రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీ తరుపున మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణ నుంచి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వ సలహదారు వివేక్ పాల్గొన్నారు. కోర్టు వివిదాలకు వెళ్లకుండా ఇక్కడే సమస్యలు పరిష్కరించుకుంటామని రెండు రాష్ట్రాల ప్రతినిధులు గవర్నర్ కు హామీ ఇచ్చారు. రెండుసార్లు హైదరాబాద్ లో భేటీ అయిన తర్వాత మరోసారి అమరావతిలో సమావేశమవ్వాలని నిర్ణయించారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటామని ఏపీ మంత్రి యనమల, తెలంగాణ మంత్రి హరీశ్ రావు మీడియాకు తెలిపారు. మొత్తం మీద రాజ్ భవన్ లో జరిగిన తొలి భేటీ సామరస్య పూర్వక వాతావరణంలో జరిగిందనే చెప్పాలి. త్వరలోనే గవర్నర్ కు ఈరోజు చర్చించిన అంశాలపై నివేదిక అందచేయనున్నట్లు వారు చెప్పారు.