కాంగ్రెస్, బీజేపీ ఎంపీల స్కెచ్ మామూలుగా లేదుగా..!
ఇప్పుడు వీరంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని స్కెచ్ వేసుకుంటున్నారు. దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉంది.
హైదరాబాద్ : గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ప్రజానీకం ఊహించని తీర్పు ఇచ్చింది. సారు.. కారు.. పదహారు అని టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బలమైన నాయకులను ఎంపీలుగా గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపుతో ఇక పార్లమెంటు సీట్లన్నీ మావే అనే ఉత్సాహం, నమ్మకంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
ఎమ్మెల్యేలుగా ఓడిన నాయకులను ప్రజలు ఎంపీలుగా గెలిపించారు. 2018లో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. 2019లో మల్కాజ్‌గిరి నుంచి రేవంత్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి ఎంపీలుగా గెలిచారు. ఇక, బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అదే కరీంనగర్ నుంచి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు.
అయితే, ఇప్పుడు వీరంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని స్కెచ్ వేసుకుంటున్నారు. దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉంది. కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... తాను హుజూర్‌నగర్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమే.
మరో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్గొండ లేదా ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలనేదే వీరి ఆలోచన. ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఈ ముగ్గురికి కుదిరితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మంత్రి పదవి అయినా దక్కుతుంది. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండొచ్చనేదే వీరి ప్రణాళిక. అందుకే, ఇప్పటి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు.
ఇక, బీజేపీ ఎంపీలు కూడా ఇదే బాటలో ఉన్నారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేందుకు.... ప్రస్తుత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కు అవకాశాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ ఇద్దరూ ఈసారి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయడం దాదాపుగా ఖాయమే. కిషన్ రెడ్డి మళ్లీ అంబర్‌పేట నుంచి పోటీ చేయనున్నారు. బండి సంజయ్ ఎక్కడ పోటీ చేస్తారనేది ఇంకా ఒక నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది.
వీరే కాకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్మూర్‌లో తరచూ పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కూడా ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.