BRS : ఈ ఫెయిల్యూర్ ఎవరిది...? అయ్యదా? అబ్బాయిదా..? గులాబీ పార్టీలో హాట్ టాపిక్
బీఆర్ఎస్ నుంచి నేతలు వరస పెట్టి వెళుతున్నారు. అయితే ఇందుకు కారణం కేసీఆర్ లేదా కేటీఆర్ కారణమా? అన్న చర్చ జరుగుతుంది;
ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆ పార్టీ కి తెలంగాణలో తిరుగులేదు. అందులో కేసీఆర్ నాయకత్వంపై అపార నమ్మకం. యువనాయకుడు కేటీఆర్ వారసుడిగా సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలతారన్న విశ్వాసం. అందుకే బీఆర్ఎస్ కు రాష్ట్రంలో తిరుగులేదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఒకే ఒక ఎన్నిక సీన్ మార్చేసింది. ఇప్పుడు తాము ఎంతో నమ్మకమైన నేతలుగా భావించిన వాళ్లే ఇప్పుడు జారుకుంటున్నారు. ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సమావేశాలు అయ్యే వారు కొందరైతే, ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసే వారు కూడా అనేక మంది కనిపిస్తున్నారు. వీరంతా గత పదేళ్లుగా కేసీఆర్, కేటీఆర్‌లు వీరుడు శూరుడు అని పొగిడిన వారే.
అధికారంలో ఉన్న నాడు...
ఒక్కరేమిటి... నాడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన వారే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్‌ఆర్ఐగా ఉన్నా ఆయనను 2019 ఉప ఎన్నికల్లో బరిలోకి దింపి కేసీఆర్ గెలిపించుకున్నారు. ఆయన ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరిపోయారు. అలాగే నాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డికి పార్టీలో పెద్దపీట వేశారు. ఆయనకు ఎమ్మెల్సీని చేసి మండలి ఛైర్మన్ ను చేశారు. ఇప్పుడు అదే గుత్తా కుటుంబంలోని ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారంటున్నారు.
నమ్మకమైన నేతలు...
గత ఎన్నికల్లో సీట్లు రాని వాళ్లు సరే. పదేళ్ల పాటు సీట్లిచ్చి.. పార్టీలో ప్రాధాన్యత ఇచ్చిన వాళ్లు కూడా పార్టీని వదిలి వెళ్లడంపై ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారంటే ఎవరిది తప్పు అన్నది పార్టీ క్యాడర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు వెళ్లడం సహజమే. అయితే ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి రావడాన్ని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ వస్తుందా? రాదా? అన్నది తెలియకున్నా పార్టీలో కొనసాగిన నేతలు కొందరయితే.. అధికారాన్ని కోల్పోయిన వెంటనే కొందరు నేతలు జారుకుంటుండటం నిజంగా పార్టీ అగ్రనేతలు కూడా ఊహించి ఉండరు.
ఎవరిపై నమ్మకం లేక...?
బీఆర్ఎస్ అంటే సహజంగా కేసీఆర్ నాయకత్వమే అని భావిస్తారు. అయితే గత పదేళ్ల నుంచి ఆయన నేతలకు అందుబాటులో ఉండకపోవడంతో కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. కేటీఆర్ కు పాలన అనుభవమే కాదు.. పార్టీని నడపటంలో తర్ఫీదు ఇవ్వడానికే కేసీఆర్ తనయుడికి ఆ పోస్టును ఇచ్చారని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ కూడా పార్టీ నేతలు వెళ్లిపోతున్నా ఆపలేకపోతున్నారు. అంటే కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం పోయిందా? లేక కేటీఆర్ వారసుడిగా నేతలు అంగీకరించలేకపోతున్నారా? అన్నది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద తండ్రీ కొడుకులపై నిన్నటి వరకూ ఉన్న నమ్మకం నేడు సన్నగిల్లడం మాత్రం నిజంగా నమ్మలేని నిజమే. మరి ఇంకా ఎంత మంది పార్టీని వీడతారో అన్న టెన్షన్ మాత్రం పార్టీ అగ్రనేతల్లో నెలకొంది.