జగన్ అనూహ్య నిర్ణయం.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే ?
వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఈ నాలుగు స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానం..
అమరావతి : త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఈ నాలుగు స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానం వైసీపీ కీలక నేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిదే. ఆయన పదవీకాలం ముగియడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. మిగతా మూడు ఇప్పుడు వైసీపీకి అదనంగా వస్తున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఎవరిని రాజ్యసభకు పంపించాలనే అంశంపై గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి పలువురి పేర్లు చర్చలోకి వచ్చాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లేదా ఆయన సతీమణి ప్రీతి అదానీ పేర్లు వినిపించాయి. కానీ, అదానీ కుటుంబం ఈ వార్తను ఖండించింది. అయితే, ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థులపై జగన్ కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇద్దరు బీసీ నేతలను, ఇప్పుడు రెడ్డి సామాజకవర్గం నేతల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగాయి.
విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వడం ఖాయమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పేరు చివరి వరకు వినిపించింది. కానీ, ఆమెకు ఈసారి ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అనూహ్యంగా బీసీల నేత ఆర్.కృష్ణయ్య పేరు తెర మీదకు వచ్చింది. ఆయన తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆయనకు రాజ్యసభ స్థానం ఖరారైంది. ఇక, బీసీల నుంచి మరొకరికి కూడా జగన్ అవకాశం ఇస్తున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావు పేరును కూడా జగన్ ఫైనల్ చేశారు. ఆయన గత ఎన్నికల తర్వాతే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఇక, మరో స్థానాన్ని ఎస్సీలకు ఇస్తారని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఇచ్చే ఛాన్స్ ఉందని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ఈసారి ఎస్సీలకు అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. నాలుగో స్థానాన్ని అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఆయన జగన్ వ్యక్తిగత న్యాయవాది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఈ నలుగురి పేర్లు ఖరారు కావడం ఖాయం.