కూచిపూడిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కేతన రెడ్డి.. ఆమె నృత్యం అద్భుతం!!

Update: 2024-08-27 13:21 GMT

మద్దిరాల కేతన రెడ్డి అనే 6 ఏళ్ల బాలిక తన కూచిపూడి ప్రదర్శనలతో ఎన్నో వేలమంది హృదయాలను కొల్లగొడుతోంది. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న కేతన ఇప్పటికే భారతీయ శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సత్తాని చాటింది.

కేవలం ఆరు సంవత్సరాల మూడు నెలల వయస్సులో, కేతన ఇటీవల అద్భుతమైన ప్రదర్శనను చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆమె తన ప్రదర్శన చేస్తున్న సమయంలో తన చేతుల్లో దీపాలను పట్టుకుని, హులా హూప్ చేస్తూ, తన తలపై ఒక కుండను నైపుణ్యంగా బ్యాలెన్స్ చేసింది. ఐదు నిమిషాల పాటూ ఆమె అద్భుతం చేసి చూపించింది. ఈ ఫీట్ ఇంత చిన్న వయస్సులో చేయడం అసాధారణమైనది. కేతన మూడు సంవత్సరాల వయస్సులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించింది. మొదట్లో తన బంధువు స్ఫూర్తితో కూచిపూడి నేర్చుకోవాలని అనుకుంది. ఆమె సోదరుడు లహర్ నందన్ రెడ్డి కూడా శాస్త్రీయ నృత్యకారుడు.



 



హైదరాబాద్ మెయిల్‌తో కేతన తల్లి పావని మాట్లాడారు. తన కుమార్తె సాధించిన విజయాలపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. “మద్దిరాల కేతనలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. ఆమె చేసే ప్రతి పని పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తూ వస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, తను సాధించిన విజయాల గురించి మేము చాలా గర్వపడుతున్నాము. ఇప్పటి వరకు 20కి పైగా స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చి కూచిపూడి నైపుణ్యాన్ని ప్రదర్శించిందని పావని తెలిపారు.

జనవరి 14, 2024న విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో కూడా కేతన ప్రతిభ హైలైట్ అయింది. ఆమె నటనకు విస్తృత ప్రశంసలు లభించాయి, ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నుండి ప్రశంసలు అందుకుంది.



 



అటు నృత్యంలో రాణించడమే కాకుండా.. కేతన అంకితభావం గల విద్యార్థిని. అటు నృత్యాన్ని.. ఇటు డ్యాన్స్ ను ఎంతో గొప్పగా బ్యాలెన్స్ చేస్తోంది. పావని మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యంతో సాంస్కృతిక విద్యను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. “మా ఉమ్మడి కుటుంబ వాతావరణం కేతనకు స్ఫూర్తినిస్తుంది. శాస్త్రీయ నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి, చరిత్ర, దేవుళ్ల గురించి తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధానం ఆమెకు డ్యాన్స్‌తో పాటు శ్లోకాలు, పాటలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది’’ అని పావని వివరించారు.



 



కేతన ఉపాధ్యాయురాలు, సాహితీ వారానికోసారి వారి ఇంటి వద్ద పాఠాలు చెబుతారు. కేతన ప్రదర్శనలను కంపోజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేతన తండ్రి మదుసూధన్ రెడ్డి ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఎఎస్)లో పనిచేస్తున్నారు. పిల్లలలో హిందూ ధర్మంపైన అవగాహన కలగడానికి, గత చరిత్రలు తెలుసుకోడానికి నిద్రపుచ్చే సమయంలో వారికి మధు సూధన్ రెడ్డి మాహాభారతం, రామాయణాన్ని చెబుతూ ఉంటారు.



 



పావని మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి దరఖాస్తు చేసుకున్నాం. కేతన అసాధారణ విజయాలను అధికారికంగా గుర్తించడానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఉన్నాము" అని అన్నారు.


Tags:    

Similar News