‘నా‘రో’లు’…‘నీ ‘రో’లు ’…?

రాజకీయాల్లో ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. లోపాలను ప్రత్యర్థులే పరస్పరం బయటపెట్టుకుంటారు. అధికారపక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షాలపై అధికారపార్టీ నిరంతరం ఆరోపణలు చేసుకుంటూ ఉ:టాయి. నిజానికి చాలా వరకూ రెండూ [more]

Update: 2021-04-28 15:30 GMT

రాజకీయాల్లో ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. లోపాలను ప్రత్యర్థులే పరస్పరం బయటపెట్టుకుంటారు. అధికారపక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షాలపై అధికారపార్టీ నిరంతరం ఆరోపణలు చేసుకుంటూ ఉ:టాయి. నిజానికి చాలా వరకూ రెండూ నిజమే అయి ఉంటాయి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు అంటూ ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఉపద్రవం ఉప్నెనలా చుట్టుముట్టుతుంటే చుట్ట కాల్చుకుందామనుకునే సంకుచిత‘ నారో’ మనస్తత్వంతో ప్రవరిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు అంటూ అధికారపార్టీలు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే సాగుతోంది. ఈ కష్ట కాలాన్ని అధిగమించడానికి నా రోలు ( పాత్ర ) ఏమిటి? నీ రోలు (పాత్ర) ఏమిటనే ఆత్మవిమర్శ మాత్రం ఎవరూ చేసుకోవడం లేదు. ప్రధానమంత్రి రిజైన్ చేయాలంటూ సోషల్ మీడియాలో మొదలైన హాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా కొనసాగడంపై బీజేపీ కారాలు మిరియాలు నూరుతోంది. ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉందని అక్కసు వెలిగక్కుతోంది. గత ఏడాది కరోనా కట్టడి విషయంలో తనకు లభించిన ప్రతిష్ఠను తాజాగా చేజేతులారా ప్రధాని మంట గలుపుకున్నారు. ప్రజారోగ్యం కంటే రాజకీయ ప్రాధాన్యాలకు పెద్ద పీట వేయడమే ఇందుకు కారణం. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఆయన ప్రతిష్ఠకు తీరని దెబ్బ తగిలింది. దీంతో దేశ విదేశాల్లోని మోడీ వ్యతిరేకులంతా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు.

అధికార పార్టీల అసహనం..

దేశంలో జాతీయంగానూ, రాష్ట్రాల్లోనూ అదికార పార్టీలు చాలా అసహనంగా ఉన్నాయి. ఉద్దేశ పూర్వకం కాకపోవచ్చు కానీ తీవ్రతను గుర్తించడంలో విఫలమయ్యాయి. దానిని అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పి , సహకరించాల్సిందిగా విజ్ణప్తి చేయవచ్చు. విమర్శలకు అతీతంగా తమ పని తాము చేసుకుపోవచ్చు. కానీ అహం అడ్డువస్తోంది. తాము సమర్థులమని, తమ తప్పేం లేదని చెప్పడానికే అధికార పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా తప్పు చేశారు . పొరపాటు అంచనాతో కరోనా పట్ల నిర్లక్ష్యం వహించారు. ఇది నిజం. దేశంలో మీడియాను కూడా అధికారపార్టీలకు వ్యతిరేకంగా వార్తలు వేయకుండా నయానో భయానో నియంత్రించారు. కానీ ప్రస్తుతం ప్రపంచ మీడియా వేలెత్తి చూపుతోంది. భారత్ మీడియా ద్వైధీ భావం కూడా ఇందుకు కారణం. దేశీయ మీడియా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలనే విషయమై నిలదీయడంలో సరైన మార్గదర్శకత్వం వహించడం లేదు. ఫలితంగానే ఇండియాలో ఏదో జరిగిపోతోందని అంతర్జాతీయ మాధ్యమాలు హడావిడి మొదలు పెట్టాయి. ఏదేమైనా దేశ ప్రతిష్ఠ బజారున పడింది. మన దేశం నుంచి విమాన యానంపై నిషేధాలు, ఆంక్లలు విధిస్తున్నాయి వివిధ దేశాలు. యూనియన్ ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు సైతం ఈ విషయంలో ఇబ్బందికరమైన పరిస్తితిని చవి చూస్తున్నాయి.

ప్రతిపక్షాలు అభాసు పాలు…

ప్రతిపక్షాలు బాధ్యతాయుతమైన పాత్రలో లేవు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉండగానే ఎన్నికలు పెట్టాలని పట్టుబట్టి రాజకీయ సమరం చేసింది తెలుగుదేశం. అప్పటికింకా కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వం తనకు నచ్చిన కమిషనర్ ను నియమించుకుంటే రాజకీయంగా టీడీపీకి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ పార్టీ బావించింది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో అధికారపార్టీకంటే ఎక్కువగా ర్యాలీలు, సమావేశాలతో చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ అగ్రనాయకులు హడావిడి చేశారు. ఎన్నికల తంతు ముగిసిన వెంటనే కరోనా గుర్తుకు వచ్చింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆపాలంటూ ఉద్యమం చేస్తామంటున్నారు లోకేశ్. అసలు ప్రతిపక్ష అగ్రనాయకులిద్దరూ హైదరాబాద్ కు పరిమితమవుతూ, అక్కడే నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమమేమిటని ఎగతాళి చేస్తోంది అధికార వైసీపీ. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెసులు కూడా ఖమ్మం, వరంగల్ వంటి చోట్ల తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి పాకులాడుతున్నాయి. ఎన్నికలనేవి ఆయా పార్టీలకు ప్రజల ఫ్రాణాల కంటే ప్రతిష్మాత్మకంగా మారడమే విషాదం.

న్యాయ స్థానాల సూక్తులు…

ఉన్నత న్యాయస్థానాలకు సకాలంలో జోక్యం చేసుకునే అధికారం ఉంది. కానీ అంతా అయిపోయాక సూక్తులు చెప్పడం విచిత్రంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియ కంటే పౌరుల ప్రాణాలు అత్యంత విలువైనవి. జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగం. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ అడ్డగోలు నిర్ణయాలతో రెచ్చిపోతుంటే అడ్డుకట్ట వేసే అధికారం కోర్టులకు ఉ:టుంది. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే కేంద్ర, రాస్ట్రప్రభుత్వాలు ఏమీ చేయలేవు. కానీ పశ్చిమబెంగాల్ హైకోర్టు వ్యాఖ్యలు, తాజాగా తమిళనాడు హైకోర్టు వ్యాఖ్యలు చేతులు కాలిన తర్వాత ఎన్నికల కమిషన్ కు సూక్తులు చెబుతున్న తీరును తలపించాయి. గడచిన ఆరునెలలుగా ప్రభుత్వాలు పూర్తిగా రాజకీయాల వైపు ద్రుష్టి పెట్టాయి. ఎన్నికల కమిషన్ తో పాటు అన్ని వ్యవస్థలూ వేరే గ్రహంలో ఉన్నట్లుగానే ప్రవర్తించాయి. ఫలితంగానే కరోనా విజ్రుంభణ కు దారి తీసింది. న్యాయస్తానాలైనా తమకున్న విశేష రాజ్యాంగాధికారాలతో జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితులు చక్కబడి ఉండేవి. ప్రభుత్వాలు తమ తీరును పునరాలోచన చేసుకుని ఉండేవి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News