BJP, YSRCP : జగన్ తో తెగతెంపులు చేసుకున్నట్లేనా.. అందుకు కారణమదేనా?

నిన్నటి వరకూ వైసీపీ అధనేత జగన్ తో మెతక వైఖరిని అవలంబించిన బీజేపీ నేడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమయింది;

Update: 2024-02-07 11:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ వైసీపీ అధినేత జగన్ తో మెతక వైఖరిని అవలంబించిన బీజేపీ నేడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమయినట్లు వస్తున్న వార్తలతో జగన్ తో దూరం పెంచుకోవడానికేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. నిజానికి బీజేపీ, వైసీపీ పొత్తులో లేవు. రెండు పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. కాకుంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రాజ్యమేలుతుంది. అయినా జగన్ విషయంలో మెతక వైఖరిని ఆ పార్టీ అవలంబిస్తుందనే అనుకోవాలి.

ఇద్దరు ఒకరికొకరు...
కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు జగన్ పైన కాని, ఇక్కడి ప్రభుత్వంపైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు. అలాగే జగన్ కూడా కేంద్ర ప్రభుత్వంపైన కానీ, బీజేపీ జోలికి పోలేదు. కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి వచ్చారు. అందుకే పొత్తులో లేకపోయినా రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా అవగాహన ఉందనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వైఎస్ జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు నిలబడి నేనున్నానంటూ వారికి చెప్పకనే చెప్పారు.
ఫ్యాన్ పార్టీలో గుబులు...
అయితే 2017లో చంద్రబాబు ఎన్డీఏతో కటీఫ్ చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు. కానీ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆఘమేఘాల మీద చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పొత్తు కుదురుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే చంద్రబాబుతో కలసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమయిందన్న సంకేతాలు ఫ్యాన్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. కానీ పైకి గంభీరంగా ఎవరితో ఎవరు కలిసినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నప్పటికీ ఎక్కడో తెలియని భయం మాత్రం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. మోదీ, షాలను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదన్నది జగమెరిగిన రాజకీయ నేతలందరికీ తెలుసు.
టార్గెట్ 400...
ఏపీలో జనసేన, టీడీపీ కూటమి బలంగా ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల ఏమైనా నివేదికలు ఇచ్చాయా? అన్న అనుమానమూ లేకపోలేదు. కాకపోతే బీజేపీ సొంతంగా ఈసారి లోక్‌సభలో 400 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఉంది. సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లయినా వస్తాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడ స్థానాలు వచ్చే అవకాశం లేదు. అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో అసెంబ్లీ లాబీల్లో ఈ రకమైన చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతుంది. మరి జగన్ కు బీజేపీ దూరం జరిగిందా? చంద్రబాబుకు దగ్గరయిందా? అన్నది రానున్న కాలంలో మరింత స్పష్టత రానుంది. మొత్తం మీద ఈరోజు మాత్రం ఏపీ రాజకీయాల్లో బిగ్ డే అని చెప్పుకోవాలి.


Tags:    

Similar News