Anil Kumar Yadav : అనిలూ.. నీవు కూడా వెళ్లాలబ్బా.. ఇక్కడ లాభం లేదు గురూ
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా నెల్లూరు నియోజకవర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడా పెడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఎవరైనా సరే.. ఎంతటి వాయిస్ ఉన్నోళ్లయినా సరే.. ఎంతటి తోపుగాళ్లయినా సరే.. గెలవడం తనకు ముఖ్యమని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జులను నియమించారు. భవిష్యత్ లోనూ అనేక మందిని ట్రాన్స్‌ఫర్ చేయడానికి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎద్దేవా చేసినా.. చేతకానితనం అనుకున్నా.... ఓటమి భయమని భావించినా.. సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు.
తప్పించడం ఖాయంగానే....
అందులో భాగంగానే నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ను కూడా అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి రాగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణపై తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ ఎక్కువగా ఉండటంతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారన్న కామెంట్స్ అప్పుడే వినిపించాయి. లేకుంటే నారాయణ గెలిచేవారని అని కూడా అన్నారు.
అక్కడి నంచి మరోసారి...
అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచే పోటీ చేయించే సాహసానికి జగన్ దిగకపోవచ్చన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పైగా నెల్లూరు నగరంలో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది. కాపు సామాజికవర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి గెలవాలంటే ఆయనను నియోజకవర్గం నుంచి తప్పించడం మినహా జగన్ కు మరొక మార్గం లేదని చెబుతున్నారు. అలాగని అనిల్ కుమార్ యాదవ్ ను పార్టీ ఇగ్నోర్ చేసినట్లు ఉండకూదన్న అభిప్రాయంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
వదులుకోవడం ఇష్టం లేక...
అనిల్ కుమార్ యాదవ్ ను వదులుకోవడం ఇష్టం లేని జగన్ ఈసారి ఆయనను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వ్యతిరేకత ఉండటం, అక్కడ బలంగా యాదవ సామాజికవర్గ ఓటర్లతో పాటు రెడ్లు కూడా అధికంగా ఉండటంతో అనిల్ ను కనిగిరికి షిఫ్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం అందుతుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు నగర నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది మాత్రం వాస్తవం. మరి అనిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే వెలువడనుంది. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.