పొత్తు ఫలితం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ చిరకాల వాంఛ. కాపులు కూడా అదే కోరుకుంటున్నారు.

Update: 2023-09-15 07:22 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ చిరకాల వాంఛ. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన ఎక్కడకు వెళ్లినా అభిమానుల నోటి నుంచి ఒకే ఒక్క పదం సీఎం.. సీఎం అని మాత్రమే. పవర్ స్టార్ అనే పదం కన్నా ఆయన సభలు, సమావేశాల్లో ఎక్కువగా సీఎం పదమే ఎక్కువగా వినపడుతుంది. అందుకు కారణం పార్టీ పెెట్టిన తమ అధినేత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్నది. పవన్ కూడా అనేక సార్లు ఆ నినాదాలు విని ముసిముసి నవ్వులు నవ్వారే తప్ప ఖండించలేదు. ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని ఈ మధ్యకాలంలో చెబుతూ వస్తున్నారు.

బలమైన సామాజికవర్గం…
ఒక్క పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఏపీలో బలమైన సామాజివర్గం కాపులు కూడా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారైనా తమ సామాజికవర్గం నేత ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలన్నది వారి ఆకాంక్ష. ఇప్పటి వరకూ వారి ఆశలు నెరవేరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొంత ఆశపడినా ఫలితాలు చూసిన తర్వాత ఆ సామాజికవర్గంలో నిరాశ కనిపించింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న తమకు సీఎం పదవి దక్కాలన్న కోరిక వారిలో బలంగా ఉంది. పవన్ వల్ల సాధ్యమవుతుందని ఆ సామాజకివర్గంలో కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారు.
ఒప్పందాలు లేకుండా…
కానీ ఉన్నట్లుండి ఎలాంటి చర్చలు లేకుండా, ఒప్పందాలు లేకుండా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించడంపై కాపు సామాజికవర్గంలో ఆందోళన వ్యక్తమవుతుంది. చంద్రబాబు టీడీపీకి సారథ్యం వహిస్తుండటంతో రెండు కలసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినా ఆయనకు తప్ప పవన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కదు. అందుకే పొత్తులు కుదుర్చుకోవడానికి ముందే ఫిఫ్టీ.. ఫిఫ్టీ షేరింగ్ అగ్రిమెంట్ అయినా చేసుకోవాల్సిందన్న అభిప్రాయం బలమైన ఆ సామాజికవర్గ నేతల నుంచి వ్యక్తమవుతుంది.
సీఎం పదవి ఎవరికి?
ఎలాంటి షరతులు లేకుండా, సీట్ల ఒప్పందం తేలకుండానే ముందుగానే పవన్ పొత్తు ఉంటుందని ప్రకటించి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడన్న వాదన కూడా ఉంది. నిజానికి పవన్ కు టీడీపీతో పొత్తు ఎంత అవసరమో ఈపరిస్థితుల్లో చంద్రబాబుకు కూడా జనసేనతో కలసి పోటీ చేయడం అంతే అవసరమని జనసేనాని గుర్తించలేకపోయారంటున్నారు. ముందుగా పొత్తును ప్రకటించి తాను టీడీపీ నేతల దృష్టిలో అలుసుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఈసారైనా కాపులు, ఫ్యాన్స్ పవన్ కు అండగా నిలబడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. పవన్ నిర్ణయంతో కాపు సామాజికవర్గంలో మాత్రం అసహనం.. అసంతృప్తి కనపడుతున్నాయన్నది వాస్తవం.


Tags:    

Similar News