Pawan Kalyan : వైసీపీని ఓడించడమే లక్ష్యమా?.. మరి టీడీపీని గ్రిప్ లో పెట్టుకోరా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని విజయం వైపు పయనించేలా చూడాలనుకుంటున్నారు.

Update: 2023-12-17 13:41 GMT

pawan kalyan janasena chief

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని విజయం వైపు పయనించేలా చూడాలనుకుంటున్నారు. వైసీపీని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. అందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ పవన్ కల్యాణ్ కు రాజకీయాల పట్ల సీరియస్ నెస్ లేదన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అధికార వైసీపీ కూడా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. నియోజకవర్గాలను మారుస్తూ కొంత మార్పు తెచ్చే ప్రయత్నానికి జగన్ శ్రీకారం చుట్టారు. పదకొండు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. మంత్రులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు.

నియోజకవర్గాల్లో...
ఒకవైపు అధికార వైసీపీ అంత సీరియస్ గా స్టెప్స్ వేస్తుంటే... పవన్ మాత్రం నింపాదిగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న క్లారిటీ ఆయనకు లేదు. అంతేకాకుండా వేళ్ల మీద లెక్కపెట్టినంత అంటే పదిలోపు నియోజకవర్గాల్లోనే జనసేనకు బలమైన అభ్యర్థులున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారు పది మంది మాత్రమే ఉంటారన్నది కాదనలేని వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కూడా లేరు. అధికార వైసీపీ నుంచి వస్తే చేర్చుకునే అవకాశం లేదు. బలహీనంగా ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పవన్ కు ఉండవు. కానీ అసలా ప్రయత్నమే చేసినట్లు కనపడటం లేదు. తాను అందరితోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఉండి..ఎవరినీ నమ్మకపోతే.. ఇలాగే ఉంటది మరి.
వారాహి యాత్రను...
మరోవైపు వారాహి యాత్రను కూడా మధ్యలోనే నిలిపేశారు. యాత్రను ఆపేసి నెలలు కావస్తుంది. వారాహి యాత్ర తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో కొంత భాగంలో మాత్రమే తిరిగింది. జనం భారీగానే వచ్చారు. ఆ వేడిని ఆసాంతం ఎన్నికల వరకూ నిలపాలన్న స్పృహ జనసేనానిలో లేదు. ఇలాగయితే జనం దృష్టిలో పార్ట్ టైం పొలిటీషియన్ గానే పవన్ ముద్ర పడిపోతారు. ఏదో పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసిన వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రసంగించి వెళ్లిపోతే కుదరదు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. జనం మనసులను గెలుచుకోవాల్సి ఉంటుంది. తన సభలకు జనాన్ని చేరేవేసే అవసరం లేదు. అది పవన్ కు ఒక వరమనే అనుకోవాలి. కానీ దానిని పవన్ కల్యాణ్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
చులకన కారా?
వారాహి యాత్ర ఎందుకు మొదలు పెట్టినట్లు? ఎందుకు ఆపినట్లు? తనకు కొద్దో గొప్పో బలమున్న చోట మాత్రమే తిరిగితే మిత్రపక్షమైన టీడీపీ దృష్టిలో చులకనగా మారరా? సీట్ల పంపకాల విష‍యంలోనూ టీడీపీదే పైచేయి కాదన్న గ్యారంటీ ఉందా? అప్పుడు అనుకుని ఏం లాభం? తాను కష్టపడి తిరిగి జనంలో ఒక మూడ్ ను క్రియేట్ చేయగలిగితే టీడీపీ దానంతట అదే దిగి వస్తుంది. తన మద్దతును టీడీపీ కోరుకోవాలని కాని, తానే టీడీపీ మద్దతు కోసం పరితపించినట్లు కనిపిస్తే మరింత చులకనగా కారా? అన్న ప్రశ్నకు పవన్ నుంచి సమాధానం ఉండదు. పవన్ కల్యాణ‌్ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. టీడీపీ కూడా తన మాట కాదనకుండా చేసుకున్నప్పుడే జనసైనికులు వెంట నడుస్తారు. అభిమానులు అండగా నిలబడతారు. కాకుంటే మళ్లీ మొన్నటి ఎన్నికల ఫలితాలే వస్తాయన్నది విశ్లేషకుల అంచనా.
Tags:    

Similar News