కష్టకాలంలో...
టీడీపీ, జనసేన పొత్తు ఖరారయింది. అదీ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ చేయి అందించాడు. జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత నేరుగా బయటకు వచ్చి పొత్తు ఉంటుందని ప్రకటించి పవన్ ఒక రకంగా టీడీపీకి ప్రాణం పోశారు. కష్టకాలంలో తాను ఆదుకుంటే తనను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు సీట్లను ప్రకటించడాన్ని జనసేనాని జీర్ణించుకోలేకపోయినట్లే కనపడుతుంది. అందుకే వెనువెంటనే రాజోలు నాదే.. రాజానగరం నాదే అంటూ రంకెలు వేశారు. అంటే స్మూత్ గా చెప్పినా మీరు పొత్తుకు ముందు ఎన్ని సీట్లు ప్రకటిస్తే తాను కూడా అన్నే సీట్లను ప్రకటిస్తానని పవన్ చెప్పినట్లయింది.
క్యాడర్ యాక్టివ్ అయ్యేందుకు...
టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనల్లో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. అరకు నియోజకవర్గంలో దొన్నెదొరను, మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావులను టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. అరకు సంగతి పక్కన పెడితే మండపేటలో మంట రాజుకుంది. అక్కడ ఉన్న జనసేన క్యాడర్ చిందులు తొక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి అభ్యర్థిని ముందుగానే చంద్రబాబు ఎలా ప్రకటిస్తారంటూ రోడ్ల మీదకు వచ్చి ప్రశ్నించారు. అది చాలదూ.. జనసేనానికి.. తాను మౌనంగా ఉంటే.. నేతలతో పాటు క్యాడర్ లో కూడా అసహనం ప్రారంభమవుతుందని, అందుకనే దానిని చల్లార్చేందుకు, తన క్యాడర్ లో తనపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే దిశగా పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేతలు కూడా ఇక పవన్ నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారని భావించి యాక్టివ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి.
అన్నీ ఆలోచించే...
ఆయనపై సొంత పార్టీలో ప్రెజర్ ఉంది. పార్టీలోనే కాదు.. ఇటు అభిమానుల్లోనూ.. అటు కాపు సామాజికవర్గం నుంచి కూడా వత్తిడి ఉంది. అసలే టీడీపీతో పొత్తు ఏంటి? అని కొందరు... ముఖ్యమంత్రి పదవి తీసుకోవద్దా? అని మరికొందరు ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఈ రెండు సీట్లకు తాను సరైన కౌంటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని కల్యాణ్ గ్రహించారు. అందుకే ఈరోజు ఆయన బయటపడ్డారు. పొత్తులతో కలసిి వెళదామంటునే పొత్తు ఎమ్మెల్యేల సీట్లతో ఆగిపోదని, మూడోవంతు సీట్లు అడుగుతామని చెప్పారు. మూడో వంతు అంటే దాదాపు అరవై స్థానాలను ఆయన అడుగుతానని పార్టీ నేతలకు చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబుకు కూడా హింట్ ఇచ్చినట్లయింది. అలాగే సీట్లతోనే కాదు అధికారం పంచుకోవడంలో కూడా పొత్తు ధర్మం పాటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అనాలోచితంగా చేసినవి అయితే కాదు. ఆచితూచి.. అన్నీ ఆలోచించి.. చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగారు.