Pawan Kalyan : అనుకున్నదే అవుతుందిగా... టీడీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారుగా
జనసేనలో చేరికలు మొదలయ్యాయి. అయితే టీడీపీ నేతలే ఎక్కువగా చేరుతుండటం చర్చగా మారింది;
ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే. టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు. అది ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరస పెడుతుండటంతో జనసైనికుల అనుమానం నిజంగా మారనుంది.
పొత్తులో భాగంగా...
పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది. చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు అసవరం కావడంతో పవన్ కల్యాణ్ కు అడిగినన్ని కాకపోయినా.. హర్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశముంది. ఇది గ్రహించిన నేతలు కొందరు టీడీపీలో ఉంటే సీట్లు రావని, జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జనసైనికుల వంతయింది.
ఈ ఇద్దరూ కలసి...
నిన్న మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ, కైకలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు. ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే. ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ ను కలిశారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు.
ఇన్నాళ్లూ ఏం చేశారు?
నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జనసైనికులు వేస్తున్నారు. ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పవన్ కల్యాణ్ రాజకీయానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. మరి టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా? అన్నది ఇంకా నిర్ణయంకాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్దయెత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దంపడుతుందన్న కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి.