Ys Jagan : నీ గేమ్ ఏంటయ్యా బాబూ...అర్ధం కాకుండా ఉందే...?

వైసీపీ అధినేత జగన్ గేమ్ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ప్రధానమైన రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెడుతున్నారు.;

Update: 2024-02-17 06:29 GMT

వైసీపీ అధినేత జగన్ గేమ్ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ప్రధానమైన రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెడుతున్నారు. తనకు అన్ని రకాలుగా అండగా ఉన్న వారిని అవతలకు నెట్టేసి సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. బీసీలు అందులోనూ యాదవులకు ఎక్కువగా స్థానాలను కేటాయిస్తూ వస్తున్నారు. ఈ గేమ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? లేక బూమ్‌రాంగ్ అవుతుందా? అన్నది ఫలితాల తర్వాత వెల్లడయ్యే అవకాశముంది. అయితే జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. బీసీలనే ఎక్కువ మంది అభ్యర్థులుగా నిర్ణయిస్తూ ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకును గంపగుత్తగా కొట్టేయాలని చూస్తున్నట్లే కనిపిస్తుంది.

బీసీలకు ఎక్కువగా...
ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. అందులోనూ యాదవులు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఈసారి వారికే ఎక్కువ స్థానాలను కేటాయిస్తూ వెళుతున్నారు. ఇప్పటి వరకూ పార్లమెంటు స్థానాలను చూసుకుంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ మధ్యలో విజయవాడ వదిలేస్తే అందరినీ బీసీ కులాల వారికే సీట్లు ఇచ్చారు. గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, నరసరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నానికి సింహాద్రి రమేష్, నరసాపురానికి గూడూరు ఉమ, ఏలూరుకు కారుమూరి సునీల్ కుమార్, రాజమండ్రికి గూడూరు శ్రీనివాస్, కాకినాడకు చలమలశెట్టి సునీల్, అనకాపల్లికి గుడివాడ అమర్‌నాధ్, విశాఖపట్నం బొత్స ఝాన్సీ, విజయనగరానికి చిన్న శ్రీను, శ్రీకాకుళానికి పేరాడ తిలక్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మధ్యలో విజయవాడ ఒక్కటే కేశినేని నానికి కన్ఫర్మ్ చేశారు.
31 మంది అవుట్...
ఇప్పటి వరకూ విడుదల చేసిన ఏడు జాబితాల్లో 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. ఇందులో 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని జగన్ చెప్పేశారు. మిగిలిన వారిని వేరే నియోజకవర్గాలకు ఛేంజ్ చేశారు. ఏడో జాబితాలో కేవలం ఇద్దరిని మార్చారు. పర్చూరుకు ఎడం బాలాజీని నియమించారు. ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహీధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో అరవింద్ యాదవ్ ను జగన్ నియమించారు. నిజంగా ఇది సంచలనమే. ఇన్ని స్థానాలను బీసీలకు గతంలో ఎప్పుడూ దక్కలేదు. అలాగే యాదవ సామాజికవర్గానికి కూడా ఇంత పెద్ద స్థాయిలో టిక్కెట్లు దొరకడం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయ చరిత్రలోనూ చోటుచేసుకోలేదని ఆ సామాజికవర్గం నేతలే చెబుతున్నారు.
రెడ్డి సామాజికవర్గంలో...
అయితే ఇలా చేయడం వల్ల జగన్ కు అన్ని రకాలుగా అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది కూడా అనుమానంగా మారింది. తాము గెలిచే స్థానాలను కూడా బీసీలకు కేటాయించడం పట్ల ఆ సామాజికవర్గంలో కొంత ఆగ్రహం వ్యక్తమవుతుంది. అయితే అది ఏ స్థాయిలో అనేది ఇప్పటి వరకూ బయటపడకపోయినా.. కొంత అసంతృప్తి అయితే రెడ్డి సామాజిక వర్గంలో మొదలయిందనే చెప్పాలి. కాని తనను కాదని టీడీపీ వైపు వెళ్లరన్న గుడ్డి నమ్మకమే జగన్ ను ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గెలుపే లక్ష్యంగా జగన్ చేస్తున్న ఈ ప్రయోగం మాత్రం ఒక సాహసంగానే చూడాలి. అయితే ఇది ఎంత మేర ఫలిస్తుంది? జగన్ పార్టీకి లాభమా? నష్టమా? అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకూ నిరీక్షించక తన్పదు. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News