Congress : నువ్వు తోపు బాబాయ్.. నీలాంటోళ్లకు మాత్రం పదవులు రాకపోయె
పార్టీలు మారుతున్న వాళ్లకే పదవులు వస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లను మాత్రం పక్కన పెడుతున్నాయి;
నిజమే.. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే.. ఫిరాయింపు దారులకే రోజులు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు మాత్రం పదవులు అస్సలు రావు. అదే పార్టీలు మారితే వాటంతట అవే పరుగులు పెడుతూ ఇంటి ముఖం ద్వారం వద్ద వెయిట్ చేస్తుంటాయి. వీటిని రోత రాజకీయాలనాలా? లేక స్శార్థ పూరితమైన పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయనాలా? అన్నది తెలియడం లేదు కానీ, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను చూసి జనం వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏ పార్టీ ఒక కట్టుబాటు లేదు. ఒక సిద్ధాంతం లేదు. తక్షణ అవసరాలు, తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయి.
పార్టీ మారిన వారికే...
ఇద్దరు నేతలను బేరీజు వేసుకుంటే.. ఇప్పుడు అదే అర్థమవుతుంది. ఒకరు రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కాగా, మరొకరు సీనియర్ నేత వి. హనుమంతరావు. ఇద్దరూ కాంగ్రెస్ నుంచే తమ రాజకీయాలను ప్రారంభించారు. ఇద్దరికీ జనాదరణ అంతగా లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇద్దరినీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కేవలం నామినేటెడ్ పోస్టులకే పరిమితం చేశారు. జనబలం వీరికి ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే .. ఒకరకంగా జనంలోకి వెళ్లి వారి మనసులను గెలుచుకోవడం ఇద్దరికీ కష్టమే. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి నెగ్గడం కూడా ఇద్దరికీ సాధ్యం కాదు. వీరిద్దరి మధ్య మరొక సాపత్యం ఉంది. అదేంటంటే ఇద్దరూ మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కావు. కానీ రాజకీయంగా మాత్రం ఎదిగారు.
ఒకే కార్డుతో...
ఇద్దరిదీ దాదాపు ఒకే సామాజికవర్గం. బీసీ కార్డు పట్టుకుని బయలుదేరుతారు. ముందుగా కేకేను తీసుకుంటే .. అధికారంలో ఉన్నంత వరకూ కేకే కాంగ్రెస్ ను వదిలిపెట్టలేదు. ఆయన వల్ల పార్టీకి ఏం లాభమో ఎవరికీ తెలియదు. ఆయన కారణంగా ఎన్ని ఓట్లు గంపగుత్తగా వచ్చి పడతాయో కూడా తెలీదు. ఎందుకంటే కేకేకు అంత సీన్ లేదన్నది అందరికీ తెలుసు. ఒక్క నియోజకవర్గంలో కూడా పట్టు లేదు. అలాంటి కేకే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పదేళ్లు పదవులను పొందారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందులోకి రావడానికి సిద్ధమయ్యారు. గాంధీభవన్ ద్వారాలు కూడా ఆయనకు తెరుచుకోవడం విశేషమే మరి. ఈయన వల్ల ఏం లాభం? అని ఒక్కసారి లెక్కేసుకుంటే చాలు.. డోర్స్ క్లోజ్ అవుతాయని అందరికీ తెలుసు. అయినా కేకేను మాత్రం పార్టీ నేతలు స్వాగతిస్తుండటం కిందిస్థాయి క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు.
పేరుకు తగ్గట్టే...
ఇక మరొక నేత వి. హనుమంతరావు. పేరులో ఉన్నట్లు రాముడికి భక్తుడిగా ఆ హనుమంతుడుంటే.. గాంధీ కుటుంబానికి వీరభక్తుడిగా ఈ హనుమంతరావు ఉన్నారు. కాకుంటే నోరు కాస్త ఎక్కువ. జన బలం లేకపోయినా బీసీ కార్డుతో తిరుగుతున్న వీహెచ్ ఆయన తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఏనాడు పక్క చూపులు చూడలేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన జెండాను వదలలేదు. గాంధీభవన్ కు రావడం మానుకోలేదు. అలాంటి వీహెచ్‌కు మాత్రం ఇంత వరకూ ఏ పదవులు రాలేదు. పార్టీ మారకపోవడమే వీహెచ్ కు శాపమయిందన్న వారు కూడా లేకపోలేదు. కానీ హనుమంతరావును మాత్రం మెచ్చుకోకుండా ఎవరైనా ఉండలేరు. వీహెచ్ నిబద్ధతకు.. సహనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే.. వేరే చెప్పనక్కరలేదు అనుకుంటా..