YouTuber Anvesh : ఏపీ రాజకీయాలు ఇప్పుడు అన్వేష్ చుట్టూ తిరుగుతున్నాయా?

అన్వేష్ కు ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ప్రాథమిక అవగాహన లేదని పలువురు ఆర్థిక నిపుణులు;

Update: 2023-11-24 11:29 GMT

ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఎలా వెళ్ళాడు.. ఎక్కడి నుండి వెళ్ళాడు.. ఏమి చేశాడు లాంటి ఎన్నో విషయాలను తన వీడియోల ద్వారా వివరిస్తూ వస్తుంటాడు. ఎవర్రా మీరంతా అంటూ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటాడు. అయితే అన్వేష్ ఉచితాల ద్వారా జింబాబ్వే దేశం ఎలా నాశనం అయిందో అని వివరించడానికి ప్రత్యేకంగా ఓ వీడియోను చేశాడు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలు చాలా ప్రమాదకరమని.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జింబాబ్వే లాగా తయారయ్యే ప్రమాదం ఉందంటూ విమర్శలు గుప్పించాడు. అసలు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇప్పటి వరకూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. జింబాబ్వేకు.. ఆంధ్రప్రదేశ్ కు చాలా తేడాలు ఉన్నాయి.. ఆ దేశ ఆర్థిక పరిస్థితికి మన దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి చాలా తేడా ఉంటుంది.. కానీ ఆర్థిక అంశాల మీద లోతైన విశ్లేషణ ఇవ్వాలని అనుకున్న ప్రపంచ యాత్రికుడు చేసిన వీడియోకు విమర్శలు కూడా వస్తున్నాయి.

వైసీపీ నేతలు కార్యకర్తలు అన్వేష్ పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే టీడీపీ నేత నారా లోకేష్ అన్వేష్ కు తాను రూ.5 కోట్లు ఇచ్చానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. 'వైసీపీ ఇచ్చే రూ.5 పేటీఎం కోసం కొందరు ప్రశ్నిస్తున్న వారిని నిందిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై 'నా అన్వేషణ' ఛానెల్ చేసిన వీడియో ప్రశంసించదగినది' అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ప్రస్తుతం జింబాబ్వే దేశంలో ఉన్న అన్వేష్.. అక్కడి పరిస్థితులను పోల్చిచూసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు ప్రజలకు అన్నీ ఉచితంగా అందించిన జింబాబ్వే దేశం ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని వివరించాడు. జింబాబ్వే మాత్రమే కాకుండా వెనిజులా, సోమాలియా వంటి దేశాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. ఉచిత పథకాల వల్ల ఆంధ్రా కూడా నష్టపోయే అవకాశం ఉందని, ఆ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 30 ఏళ్లు పడుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త వ్యాపారాలు, కంపెనీలు వచ్చినప్పుడే ఆదాయం సమకూరుతుంది. ఆదాయ కల్పన వల్ల భవిష్యత్తు బాగుంటుందని, ఉచిత పథకాలు నేడు మాత్రమే కడుపు నింపుతాయని అన్వేష్ అన్నారు. ఈసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించాలని ఆ వీడియోలో తెలిపారు అన్వేష్.
అన్వేష్ కు ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ప్రాథమిక అవగాహన లేదని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రయాణం పట్ల అన్వేష్ కు ఉన్న ఆసక్తిని ప్రశంసిస్తున్నారు కానీ భారతదేశంలోని ఒక రాష్ట్ర పరిపాలనను ఆయన విశ్లేషించిన విధానం కరెక్ట్ కాదని అంటున్నారు. అతని రాజకీయ అజ్ఞానం, ఆర్థికపరమైన విషయాలపై పెద్ద నాలెడ్జ్ లేదని స్పష్టమవుతోంది. జింబాబ్వే ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం అనే చిన్న లాజిక్ ను అన్వేష్ మరచిపోయాడు. జింబాబ్వే దేశంలో కరెన్సీ నోట్లను ఎలా ముద్రిస్తారో, దాని ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం కావడంతో అలాంటివేవీ జరగవని కూడా మరచిపోయి మాట్లాడేశాడు. భారతదేశంలోని ఏ రాష్ట్రమైనా నిర్దిష్ట పరిమితిలోపు రుణాలపై ఆధారపడతాయంతే!! వివిధ రాష్ట్రాలకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఏపీ కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయనే విషయాన్ని తెలియకుండా అన్వేష్ ఈ వీడియో చేశారని.. ఆయన అభిమానులే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ రాజకీయాలు అన్వేష్ పెట్టిన వీడియో చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.


Tags:    

Similar News