India vs England Third T20 : ఓటమికి అదే కారణమా? నాలుగో మ్యాచ్ లోనైనా సరిదిద్దుకుంటారా?
ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య రాజ్ కోట్ లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది;
![India vs England Third T20 : ఓటమికి అదే కారణమా? నాలుగో మ్యాచ్ లోనైనా సరిదిద్దుకుంటారా? india, england , third T20, rajkot](https://www.telugupost.com/h-upload/2025/01/29/1500x900_1685395-india.webp)
టీ 20 లలో టీం ఇండియా విజయాలకు ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య రాజ్ కోట్ లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. బౌలర్లు రాణించినా బ్యాటర్లు మాత్రం సక్సెస్ కాలేకపోవడంతోనే మూడో వన్డేలో ఇండియాకు ఓటమి లభించిందని చెప్పవచ్చు. ఇంగ్లండ్ పెద్ద స్కోరు ఏమీ చేయలేకపోయినా ఛేజింగ్ లో దానిని అధిగమించేందుకు టీం ఇండియా బ్యాటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. ఓపెనర్ల నుంచి అందరూ క్యూ కట్టడంతో ఇక గెలుపు అసాధ్యమని ముందే తేలిపోయింది. అతి విశ్వాసంతోనే మ్యాచ్ ను చేజార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ టీం ఇండియా నాలుగో మ్యాచ్ లో రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వరుణ్ చక్రవర్తి విజృంభించి...
ఎప్పటిలాగానే రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు తొలుత దూకుడుతో ఆడారు. సాల్ట్ మరోసారి విఫలమయినా డకెట్, బట్లర్ నిలబడటంతో మంచి స్కోరు ఇంగ్లండ్ సాధిస్తుందని అంచనా వేశారు. ఒక దశలో రెండు వందల పరుగులు చేస్తుందని భావించారు. కాని వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో వరస వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కట్టడి చేయగలిగారు. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. హార్థిక్ పాండ్యా రెండు వికెట్లు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీయడంతో ఇంగ్లండ్ ఇరవై ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది.
స్వల్ప లక్ష్యమే అయినా...
నిజానికి 171 పరుగులు సాధించడం టీం ఇండియాకు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. ఎందుకంటే గత రెండు మ్యాచ్ లలో ఆటగాళ్ల ఫామ్ చూసిన వారికి ఎవరికీ అనుమానం ఇసుమంత కూడా కలగలేదు. అయితే అవసరం లేని షాట్లతో ఫోర్లు, సిక్సర్లు కొడదామనుకున్నఆటగాళ్లు అవుటయి తర్వాత వచ్చే వారిపై భారం మోపారు. వత్తిడి తట్టుకోలేక వరసగా అందరూ అవుట్ అవుతుండటంతో టీం ఇండియా పరాజయం ఖాయమని ముందే అంచనాలు వేసుకున్నారు. హార్థిక్ పాండ్యాఒక్కడే నలభై పరుగులు చేసి పరవాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ వరసగా పెవిలియన్ బాట పట్టడంతో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలయింది. నాలుగో మ్యాచ్ ను అయినా సొంతం చేసుకుని ఇండియా సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.