India Vs Newzealand : ఎందుకురా అయ్యా ఆడటం... మీ దుంపలు తెగ.. ఈ టెస్ట్ కూడా పోయినట్టేనా?

పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ మరోసారి చేతులెత్తేసింది. న్యూజిలాండ్ పై చేయి సాధించింది

Update: 2024-10-25 06:08 GMT

 India Vs Newzealand 2024

పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ మరోసారి చేతులెత్తేసింది. ఏడువికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎవరూ ఆడింది లేదు. పొడిచింది లేదు.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశపర్చారు. బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ దారుణ ఓటమి చెందినా ఆటగాళ్ల ఆటతీరులో మార్పు రాలేదు. జట్టులో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూణేలోనూ మెరుగుపడలేదు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఓపెనర్ గా దిగి నిన్ననే అవుటయ్యాడు. ఈరోజు ఉదయం నుంచి ఆరు వికెట్లు కోల్పోయాయి. విరాట్ కోహ్లి ఒక పరుగు చేసి వెనుదిరిగారు. యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ కూడా తక్కువ పరుగులకే అవుటయ్యారు.

వరసగా అవుటయి...
ఇక ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్ 11 పరుగులకే అవుటయ్యాడు.ఇక 103 పరుగుల వద్ద అశ్విన్ నాలుగు పరుగులు చేసి వెనుదిరగడంతో ఇక భారత్ పూణే టెస్ట్‌లోనూ చాపచుట్టినట్లయింది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాటర్లు విలవిలలాడిపోతున్నారు. ఒక్కరూ క్రీజులో కుదురుగా ఉండలేక బ్యాట్ పట్టుకుని వచ్చిన దారిన వచ్చినట్లే వెనుదిరుగుతుండటంతో ఇక పూణే లో కూడా ఓటమి దిశగానే భారత్ వెళుతుందని కనిపిస్తుంది. సొంత గడ్డపై కనీసం న్యూజిలాండ్ కు సరైన జవాబు ఇవ్వడం లేదు. గెలవడం మాట దేవుడెరుగు కనీసం డ్రా దిశగానైనా ప్రయత్నించాలని భావించినా అది కూడా కుదరడం లేదు.
తొలి ఇన్నింగ్స్ లో...
పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో భారత్ 259 పరుగులకే ఆల్ అవుట్ చేయగలిగింది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు. మనకు అడ్వాంటేజీ ఉంటుందని అంచనా వేశారు. కానీ కనీసం పరుగులు చేయకుండానే అవుట్ కావడం మాత్రం ఫ్యాన్స్ ను నిరాశపర్చిందనే చెప్పాలి. టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేయడంతో ఈ టెస్ట్‌లోనూ కనీసం పరుగులు చేయాల్సి ఉన్నప్పటికీ న్యూజిలాండ్ కు అంతా అప్పగించేసినట్లయింది. న్యూజిలాండ్ పెట్టిన టార్గెట్ ను దాటేసి మరో రెండు వందల పరుగులు చేయాల్సిన భారత్ బ్యాటర్లు ఇలా బ్యాట్‌లు ఎత్తేయడం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపర్చింది. మరి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News