ఆస్ట్రేలియా నుండి మ్యాచ్ ను లాగేసుకున్న టీమిండియా

టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్

Update: 2023-12-03 17:04 GMT

గెలిచే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో సాగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు విజయం లాంఛనమే అని అందరూ భావించగా.. ఆఖర్లో వికెట్లను చేజార్చుకుని ఆస్ట్రేలియా ఓటమిని మూటగట్టుకుంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్ అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో భారత్ విజయాన్ని దక్కించుకుంది. సిరీస్ ను 4-1 తో భారత్ సొంతం చేసుకుంది.

టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీతో రాణించాడు. యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అక్షర్ పటేల్ పర్వాలేదనిపించారు. అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు నమోదు చేయగా... జితేశ్ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 24 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 2, బెన్ డ్వార్షూయిస్ 2, ఆరోన్ హార్డీ 1, నాథన్ ఎల్లిస్ 1, తన్వీర్ సంఘా 1 వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా తరపున బెన్ మెక్ డెర్మోన్ట్ 54 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టిమ్ డేవిడ్, షార్ట్, వేడ్ లు లక్ష్యాన్ని చేధించే క్రమంలో వికెట్లను ఇచ్చేసారు. భారత్ తరపున ముకేశ్ కుమార్ 3, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.


Tags:    

Similar News