India vs South Africa T20 : చేతులెత్తేస్తారా...? సమం చేస్తారా...? మనోళ్ల మీద నమ్మకం మాత్రం
ఈరోజు మూడో టీ20లో ఇండియా దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జోహానెస్‌బర్గ్ లో ఈ మ్యాచ్ నేడు జరగనుంది;
ఒక మ్యాచ్ వర్షం మింగేసింది. మరో మ్యాచ్ ను బౌలర్లు చెడగొట్టేశారు. ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్. సిరీస్ సమం చేయాలంటే ఇదే ఇండియాకు సరైన మ్యాచ్. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే దానిదే సిరీస్. అందుకే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ కు అంతటి విశిష్టత ఉంది. ఈరోజు మూడో టీ20లో ఇండియా దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జోహానెస్‌బర్గ్ లో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. అయితే చిరుజల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్ జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇది బ్యాటర్లకు అనుకూలించే మైదానం.
వీరిద్దరే...
అందుకే జోహానెస్‌బర్గ్ లో ఎవరు బ్యాటింగ్ చేసినా అత్యధిక పరుగులు నమోదు చేసే అవకాశాలున్నాయి. అయితే మన బౌలర్లు ఏ మాత్రం దక్షిణాఫ్రికాను కట్టడి చేస్తారన్నది అనుమానమే. ముఖేశ్ కొద్దిగా పరవాలేదు కానీ, అర్ష్‌దీప్ సింగ్ మాత్రం అధిక పరుగులు ఇస్తూ ఇండియాపై వత్తిడి తెస్తున్నాడు. డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పనేనని అందరికీ తెలిసిందే. కానీ మరో ప్రత్యామ్నాయం లేదు. ముఖేశ్, అర్షదీప్ సింగ్ పైనే నేటి మ్యాచ్ కూడా ఆధారపడి సాగనుంది.
బ్యాటర్లుగా ...
మరోవైపు గత మ్యాచ్‌లో ఓపెనర్లుగా దిగిన యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ డకౌట్ కావడం కూడా దురదృష్టకరమే. అయితే ఈ మ్యాచ్ లో వీరు నిలకడగా ఆడాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అలాగే జితేశ్ శర్మ కూడా తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత్ అభిమానులు కోరుతున్నారు. రింకూసింగ్, సూర్యకుమార్ యాదవ్‌లు ఫామ్ లోనే ఉన్నారు. జడేజా కూడా ఉండటంతో బ్యాటింగ్ పరంగా ఇబ్బంది లేకపోయినా ఈ మ్యాచ్‌లో టి ఇండియా గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మనోళ్లు చేతులెత్తేస్తారా? సమం చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.