Team India : సీనియర్లు ఫామ్ లోకి వచ్చేశారోచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు గుడ్ న్యూస్
భారత్ - ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన మూడో మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది;

భారత్ - ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన మూడో మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై గెలుపొందింది. టాస్ ఎవరికి పడిందన్నది కాదు.. బ్యాటు ఎత్తిందెవరన్న ప్రశ్నకు భారత్ బ్యాటర్లు స్పష్టమైన సమాధానం ఈ సిరీస్ ద్వారా ప్రపంచ దేశాలకు బదులివ్వగలిగారు. న్యూజిలాండ్ తో సొంత గడ్డపై ఓటమి, ఆస్ట్రేలియాతో పరాజయంతో కుంగిపోయిన భారత్ జట్టుకు టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటు ఇంగ్లండ్ ను వన్డేల్లో కూడా ఓడించి తమకు తిరుగులేదని నిరూపించగలిగారు. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి 3 - 0 సిరీస్ ను సొంతం చేసుకుని క్లీన్ స్వీప్ చేయగలిగారంటే అందుకు అందరిని అభినందించాల్సిందే.
అభిమానులు ఆందోళనను...
ముఖ్యంగా ఈ వన్డేల్లో గమనించాల్సిన విషయం సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లోకి రావడం. నిన్న మొన్నటి వరకూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లో లేరు. న్యూజిలాండ్ సిరీస్ లోనూ, ఆస్ట్రేలియా టూర్ లోనూ పేలవమైన ప్రదర్శన చేయడంతో వీరిపై అభిమానులకు ఆశలు లేవు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతున్న సమయంలో వీరు ముగ్గురు ఫామ్ లో లేకపోవడంతో అందులో ఎలా నెగ్గుకు వస్తారన్న ఆందోళన ఫ్యాన్స్ లో నెలకొంది. గేమ్ అన్నాక గెలుపు ఎంత సహజమో. ఓటమి కూడా అంతే సహజం. వరస విజయాలు కూడా ఎవరికీ దక్కవు. అలాగే ఓటములు కూడా ఎక్కువగా ఉంటే దానిని అభిమానులు జీర్ణించుకోలేరు.
భారీ స్కోరు తేడాతో...
ఇంగ్లండ్ తో ఆడిన రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మసెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక మూడో మ్యాచ్ లో విరాట్ కోహ్లి నిలబడి ఆడి అర్థ శతకం బాది భారత్ విజయానికి కారణమయ్యాడు. అలాగే కేఎల్ రాహుల్ సయితం నలభై పరుగులు చేసి తాను కూడా రైజింగ్ లో ఉన్నానని తనను తాను నిరూపించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ యాభై ఓవర్లలో 356 భారీ స్కోరు చేసింది. శుభమన్ గిల్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ లు అర్థశతకం చేశారు. ఇక తర్వాత 357 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 142 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అన్ని వికెట్లు కోల్పోయి భారీ స్థాయిలో పరాజయంపాలయింది. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, హార్డిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను ఇంటికి పంపించగలిగారు.