ఘన విజయం సాధించిన భారత్.. సెంచరీతో కదం తొక్కిన శ్రేయాస్ అయ్యర్

Update: 2022-10-10 01:14 GMT

రాంచీలో దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీ బాదగా, ఇషాన్ కిషన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ 84 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. కిషన్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. చివర్లో సంజు శాంసన్ (36 బంతుల్లో 30 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, శుభ్ మాన్ గిల్ 28 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 1, వేన్ పార్నెల్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఐడెన్ మార్ క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 పరుగులు చేశారు. క్లాసెన్ 30 పరుగులు చేయగా, మిల్లర్ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు, ఓపెనర్లు డికాక్ 5, జానెమన్ మలాన్ 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా, సుందర్ 1, షాబాజ్ అహ్మద్ 1, కుల్దీప్ యాదవ్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే అక్టోబరు 11న ఢిల్లీలో జరగనుంది.


Tags:    

Similar News