గ్రూప్ 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న
ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగం సినిమా గురించి ప్రశ్న ఇచ్చారు. ఆ పరీక్షలో 2023లో ఒనికో ఫిలిమ్స్..
తెలంగాణలో శనివారం గ్రూప్ -4 పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్ 1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్షలు జరిగాయి. గ్రూప్ -4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, కొమురయ్య పాత్ర గురించి నాలుగు ఆప్షన్స్‌ను ఇచ్చి, వాటిని జత చేయాలని ఆప్షన్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బలగం సినిమాపై పోటీపరీక్షల్లో ప్రశ్న అడగడం ఇదే తొలిసారి కాదు.
ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగం సినిమా గురించి ప్రశ్న ఇచ్చారు. ఆ పరీక్షలో 2023లో ఒనికో ఫిలిమ్స్ అవార్డుల్లో ‘బలగం’ సినిమాకి ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్నను ఇచ్చారు. అప్పుడు దీని గురించి దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బలగం సినిమాపై ప్రశ్నించారు. ప్రజలకు మానవ సంబంధాలను గుర్తు చేసిన ఈ సినిమాపై ప్రశ్నలు అడగడం తప్పు కాదు కానీ.. ప్రతి పోటీ పరీక్షలోనూ సినిమాపై ప్రశ్నలు ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. సినిమా పరంగా చూస్తే.. "బలగం" తెలంగాణ పల్లెను, మట్టిని, మనుషులను ఆవిష్కరించింది. థియేటర్లలో, ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ప్రతి ఊరిలోని ప్రజలతో కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా రావడం విశేషం.