తొమ్మిదేళ్ల పాపకు సీఎం కేసీఆర్ నామకరణం
తమ బిడ్డకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత నామకరణం చేయించాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక తొమ్మిదేళ్ల తర్వాత నెరవేరింది
తమ బిడ్డకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత నామకరణం చేయించాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక తొమ్మిదేళ్ల తర్వాత నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో భూపాలిపల్లి మండలం నందిగామ చెందిన సురేష్ చురుగ్గా పనిచేశారు. సరేష్, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డకు కేసీఆర్ చేత పేరు పెట్టించాలనుకున్నారు. ఇంతలో తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. కేసీఆర్ ను కలిసే వీలు కలగలేదు. తొమ్మిదేళ్లు ఆ బిడ్డకు పేరు పెట్టకుండానే కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
తొమ్మిదేళ్ల కల...
ఆడపిల్లకు పేరు పెట్టకుండా తొమ్మిదేళ్లు ఉన్న విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ మధుసూధనాచారి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ సురేష్, అనిత దంపతులను ఆహ్వానించారు. ఈరోజు ప్రగతి భవన్ కు వచ్చిన ఆ అమ్మాయికి కేసీఆర్ దంపతులు మహతిగా నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన దంపతులకు బట్టలు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆతిధ్యమిచ్చారు. ఆ బిడ్డను దీవించారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. తొమ్మిదేళ్ల తమ కల ఫలించిందని ఆ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.