Kharge : మోదీ భయపెడతాడు.. అలర్ట్‌గా ఉండండి

పేద, మధ్య తరగతి ప్రజలు ధరల పెరుగుదలతో దేశంలో అల్లాడి పోతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జు ఖర్గే అన్నారు

Update: 2024-01-25 11:25 GMT

పేద, మధ్య తరగతి ప్రజలు ధరల పెరుగుదలతో దేశంలో అల్లాడి పోతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జు ఖర్గే అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక అంశాన్ని తీసుకు వచ్చి డైవర్ట్ చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని అన్నారు. ఒకసారి పాకిస్థాన్ బూచి చూపిస్తారని, మరోసారి దేవుడిని కూడా వాడుకుంటారని ఖర్గే అన్నారు. హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు.

రెండు గ్యారంటీలను...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు గ్యారంటీలను అమలులోకి తీసుకు వచ్చామన్నారు. దేశంలో తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకుంటున్నారని అన్నారు. మొన్నటి ఎన్నికల మాదిరిగానే రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. నాయకులంతా ఐకమత్యంగా ముందుకు వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారరు. తెలంగాణలో మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలులోకి తెస్తామని చెప్పారు. మోదీ, షా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేయడంపైనే ఎక్కువ దృష్టి పెడతారని, వారు ప్రజా సమస్యలను పట్టించుకోరని అన్నారు.
అత్యధిక స్థానాలను...
ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా ఎమ్మెల్యేలను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తారన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి తో సహా కాంగ్రెస్ నేతలను భయపెడతారని కూడా తనకు తెలుసునని అన్నారు. బీజేపీ భయపెట్టినా తెలంగాణలో భయపడే వారు ఎవరూ లేరన్నారు. అయినా సరే అలర్ట్ గా ఉండాలని ఖర్గే అన్నారు. సామాన్య ప్రజలు కష్టాలను తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారి కోసమే రాహుల్ న్యాయయాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలిపించి పార్లమెంటులో సత్తా చాటాలని ఆయన పిలుపు నిచ్చారు. కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం దక్కేలా శ్రమించాలని కోరారు.


Tags:    

Similar News